కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో తప్పు చేస్తోందా..? ఆలయాలపై విధిస్తున్న పన్ను ఆ పార్టీకి తీరని నష్టం చేస్తుందా..? ఆలయాలపై పన్ను విధిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై జనం మండిపడుతున్నారు. హిందువుల ఆలయాలపై పన్నులేమిటని ప్రశ్నిస్తున్నారు. కావాలనే హిందువులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారు. హిందువుల ఆలయాల మీద వచ్చే ఆదాయాన్ని హిందువుల కోసం ఖర్చు చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసే బీజేపీ నేతలు, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. హిందువుల ఆలయాల బాధ్యతను హిందువులే చూసుకోవాలని ఉపన్యాసాలు దంచికొట్టే బీజేపీ నేతలు ఇప్పుడేమై పోయారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

బీజేపీ అధికార భాగస్వామ్యంతో నడుస్తున్న బీహార్ ప్రభుత్వం ఇటీవల ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై వచ్చే రాబడిలో 4 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని ఆలయాల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన ఆలయాలపై మాత్రమే కాకుండా..  ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉండే ఆలయాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంతంగా గుడులు కట్టుకొని నిర్వహిస్తున్నవారు కూడా నాలుగు శాతం పన్ను కట్టాలని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఆలయాన్నిటినీ రిజిస్టర్ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయినా పన్ను మాత్రం చెలించాల్సిందేనంటూ ప్రకటన జారీ చేసింది.

ఈ ఉత్తర్వులపై హిందూ భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. మిగతా మతాలకు లేని నిబంధనలు హిందూ ఆలయాలపై మాత్రమే ఎందుకంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పోరాటం కూడా మొదలుపెట్టినట్టు హిందూ సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆలయాలను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించాలని హిందూ సంఘాల నేతలు కోరుతున్నాయి. భక్తితో దేవుడికి సమర్పించే హుండీ సొమ్మును కూడా ఖజానాకు మళ్ళించుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇలా దేవుడి కానుకలపై కూడా కన్నేసిన బీజేపీ తీవ్ర విమర్శల పాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: