ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను గండం పొంచి ఉంది.. ఇటీవలే రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి.. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు మరో తుపాన్‌ ఏపీకి పొంచి ఉంది. ఈ తుపాన్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ఉత్తరాంధ్రలో తుపాన్‌ పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.  అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.


ముఖ్యంగా లోతట్టు, ముంపు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలనన్న సీఎం జగన్.. తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ఉత్తరాంధ్రలో తుపాన్‌ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను సీఎం జగన్  ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. వారెవరంటే.. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌. అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌ దండే, విశాఖ జిల్లాలకు శ్యామల రావును సీఎం జగన్ ప్రత్యేక అధికారులుగా నియామించారు.


ఈ ముగ్గురు అధికారులు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి తుపాన్‌ సహాయ కార్యక్రమాల సమన్వయం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆయా జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలను జగన్ వారికి అప్పగించారు. మొన్నటి రాయల సీమ వరదల విషయంలో జగన్ సర్కారుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. భారీ వర్షాలు కురుస్తాయని ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా స్థానికులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.


అందుకే ఈసారి అలాంటి విమర్శలు రాకుండా సీఎం జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తగిన చర్యలకు సిద్ధంగా ఉండాలని జగన్ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: