పరువు నిలిపే ప‌థ‌కం కాస్తా ప‌రువు పొగొట్టుతోంది. ద‌ళిత బంధు అమ‌లు నిలిచి చాలా కాలం అయింద‌ని ఇంకెక్క‌డి ప‌థ‌కం అని కొంద‌రు నోరెత్తుతున్నారు. ఎప్ప‌టిలానే నిన్నొక మాట ఇప్పుడొక మాట చెప్ప‌డం కేసీఆర్ కు తెలిసిన విద్యే అని మండిప‌డుతున్నారు ఇంకొంద‌రు ద‌ళితులు. అయినా స‌రే ప్రెస్మీట్ల‌లో కేసీఆర్ ద‌ళిత బంధు త‌ప్పక అమ‌లు చేస్తామ‌నే అంటున్నారు.

ఎన్నిక‌ల ముందు ఒక మాట త‌రువాత ఒక మాట మాట్లాడ‌డం మ‌న నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య. ముందంతా మీకు నేనున్నా అని  చెప్పే నాయ‌కులు త‌రువాత మాత్రం మీరెవ్వ‌రో తెలియ‌దు అన్న చందంగా ప్ర‌వ‌ర్తించ‌డం ష‌రా మామూలే! ఉప ఎన్నిక‌ల త‌రువాత కూడా ఇలాంటి ప‌రిణామ‌మే జ‌రిగింది. తాము కేసీఆర్ ను న‌మ్ముకున్నందుకు త‌గిన బుద్ధి వ‌చ్చింద‌ని కొంద‌రు దుమ్మెత్తిపోస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని అమలు చేయాల‌నుకున్న ద‌ళిత బంధు ప‌థ‌కం ఇప్పుడు ఎక్క‌డిక్క‌డ ఆగిపోయింది. అంతా ఊహించిన విధంగానే జరిగింది. ఆయ‌న అనుకున్న‌ది వేరు..క్షేత్ర స్థాయిలో జ‌రుగుతున్న‌ది వేరు. దీంతో ఏం చేయాలో తోచ‌క ల‌బ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాళ్ల‌రిగేలా తిరిగినా కూడా ఫ‌లితం లేద‌ని వాపోతున్నారు. ఎన్నిక‌ల త‌రువాత ఆ ప‌థ‌కం ఊసే లేకుండా పోయింద‌ని కొంద‌రు వాపోతున్నారు. సీఎం ద‌త్త‌త గ్రామం అయిన వాసాల‌మ‌ర్రిలో కూడా ఇలానే ఉంది. వాస్త‌వానికి ద‌ళిత బంధు పథ‌కం త‌న డ్రీమ్ ప్రాజెక్టు అని, దీనిని అమ‌లు చేయ‌డం త‌న బాధ్య‌త అని తెగ మాట‌లు పెద్ద సారు చెప్పి, ఇప్పుడు మ‌రిచినార‌ని కాంగ్రెస్ పెద్ద‌లు పెద‌వి విరుస్తున్నారు. ద‌ళిత బంధుకే దిక్కులేక‌పోతే, మ‌రి బీసీ బంధు ఎలా అమ‌లు చేస్తార‌ని విమ‌ర్శ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుపై ఎప్ప‌టిలానే సందేహాలు ముసురుకున్నాయి. హుజురాబాద్ లో అయితే ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు ఎప్పుడో అట‌కెక్కేసింది. దీంతో ప‌థ‌కం గురించి తామెప్పుడో మ‌రిచిపోయామ‌ని, అవ‌న్నీ ఎన్నిక‌ల మాట‌ల‌గానే తాము ప‌రిగ‌ణిస్తామ‌ని హుజురాబాద్ ప్ర‌జ‌లు అంటున్నారు. ఎన్నిక‌ల ముందు ఈ ప‌థ‌కంపై ఎన్నో ఆశ‌లు రేపార‌ని, ల‌బ్ధిదారుల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాన‌ని సీఎం చెప్పార‌ని, కానీ అవ‌న్నీ ఇప్పుడు ఏమ‌య్యాయ‌ని వీరంతా ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: