ప్రస్తుతం రాజకీయాల్లో అత్యంత దారుణంగా ఉన్న ఏకైక అంశం నేతలు వాడే భాష మాత్రమే. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తాము ఉపయోగించే భాషపై పట్టుకోల్పోయారు. చివరికి తామంతా ప్రజా ప్రతినిధులమనే కనీస విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే... ప్రజలు మనల్ని గమనిస్తున్నారనే కనీస ఇంకిత జ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నారు. అది ప్రజా సమస్యలపై చర్చించే వేదికైనా, చట్టాలు చేసే చట్ట సభ అయినా, ప్రజలతో ముఖాముఖీ అయినా, మీడియా సమావేశమైనా, బహిరంగ సభ అయినా, ఎన్నికల ప్రచార వేదిక అయినా సరే.... మనం ఉపయోగించే భాషపై పట్టు ఏ మాత్రం కోల్పోకూడదు. తమ ప్రత్యర్థులు ఎలాంటి వారు అయినా, ఎవరైనా సరే... ఎదుటి వారికి కనీస గౌరవం ఇస్తూ... ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. చట్ట సభల గౌరవం కాపాడాలంటూ ఇటీవల విశాఖలో జరిగిన ఓ సభలో సాక్షాత్తు దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారంటే... ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల నేతలు ఉపయోగించే భాష అత్యంత దారుణంగా మారిపోయింది. చివరికి తమ స్థాయిని, స్థానాన్ని మరిచిపోయి కూడా మాట్లాడుతున్నారు నేతలు. మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా విచక్షణ మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల శాసన సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఇక మంత్రి కొడాలి నానికి ప్రతిపక్ష నేతలు బూతుల మంత్రి అని పేరు పెట్టేశారు కూడా. ఇప్పుడు తాజాగా మరో మంత్రి కూడా ఆ జాబితాలో చేరేలా ఉన్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు ప్రారంభం ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ మీడియా సంస్థల అధినేతలపైన, ప్రతిపక్ష నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నోరు పారేసుకున్నారు. అరే ఓరే అనటంతో పాటు... మరో అడుగు ముందుకు  వేశారు. తన చుట్టూ మహిళలు ఉన్నారనే విషయం కూడా మంత్రి గారు మర్చిపోయారు. ప్రజా ప్రతినిధి, బాధ్యత గల మంత్రి అనే విషయాన్ని కూడా మరిచారు అనిల్ కుమార్ యాదవ్.


మరింత సమాచారం తెలుసుకోండి: