కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో కరోనా మృతదేహాలు కుళ్లిపోయాయి. ఈ విషయం బయటపడటంతో.. ఆ ఆస్పత్రి డైరెక్టర్ జితేంద్ర కుమార్ ను సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ రేణుకా రామయ్యను నియమించారు. అయితే గతేడాది ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కానీ అప్పటి నుంచి వారి అంత్యక్రియలు నిర్వహించలేదు. దీంతో  వారి మృతదేహాలు కుళ్లిపోయాయి. ఈ విషయం గత వారం బయటపడింది.

మరోవైపు బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ సోకగా.. ఒకరికి మాత్రమే ట్రావెల్ హిస్టరీ ఉందని కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్ తెలిపారు. ఒకరు 66ఏళ్ల సౌతాఫ్రికా వ్యక్తి అని. మరొకరు 46ఏళ్ల డాక్టర్ అని తెలిపారు. సౌతాఫ్రికా వ్యక్తి గత నెల 20న వచ్చి, తిరిగి వెళ్లిపోయాడన్నారు. అయితే డాక్టర్ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అందరూ టీకాలు తీసుకున్నారనీ.. ఎవరికి తీవ్ర లక్షణాలు లేవని చెప్పారు.

దేశంలో ఒమిక్రాన్ కేసులు తొలిసారి కర్ణాటకలో వెలుగు చూసిన కారణంగా.. ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, కొత్త వేరియంట్, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోస్ పంపిణీ తదితర విషయాలపై చర్చించినట్టు బొమ్మై తెలిపారు. బూస్టర్ డోస్ వేయడంపై నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్ర వైద్య శాఖ,.. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన ఇద్దరిని ఇన్ని రోజులుగా కలిసిన వారిని ట్రేస్ చేసే పనిలో అధికారులున్నారు. కర్ణాటక రాష్ట్ర వైద్య శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ వారిని గుర్తించే పనిలో కేంద్రం ఉంది.












మరింత సమాచారం తెలుసుకోండి: