హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. హైదరాబాద్ నగరంలోనూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెద్దనోట్ల రద్దు వరకూ కాస్త అందుబాటులోనే ఉన్న ధరలు ఆ తర్వాత విపరీతంగా పెరగడం ప్రారంభించాయి. ఇక ఇప్పడు అన్నివిధాలుగా అనుకూల విధానాలు ఉండటంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెగిలిపోతోంది. మొన్నటి హైటెక్ సిటీ వద్ద భూముల వేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ఇప్పడు తాజాగా ఉప్పల్ భగాయత్ వేలంలోనూ ప్లాట్ల ధరలు అదిరిపోయాయి.


ఉప్పల్‌ భగాయత్‌లో లే ఔట్‌లో గతంలోనూ వేలాలు జరిగాయి. ఇప్పుడు జరిగింది మూడో దశ వేలం. ఇది కూడా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థకు కాసుల వర్షం కురిపించింది. మొదటి రోజు ఈ-వేలంలో రేట్లు అధికారుల అంచనాలను దాటేశాయి. గతంలో పలికిన ధర కంటే చాలా ఎక్కువ ధరలకు బిడ్లు వచ్చాయి. అత్యధికంగా రెండు ప్లాట్లు మాత్రం చదరపు గజానికి రూ.1.01 లక్షల ధర పలికాయి. ఇది ఉప్పల్ భగాయత్ లే ఔట్‌లో అత్యధిక ధర కావడం విశేషం. ఇక తక్కువలో తక్కువ ఎంతో తెలుసా.. గజం రూ.53 వేలు మాత్రమే.


ఉప్పల్ భగాయత్‌ లేఔట్‌లో భూములకు గజం రూ. 35 నిర్ణీత ధరగా ఉంది. అక్కడి నుంచి వేలం మొదలైంది. ఉదయం సెషన్లో ఓ ప్లాట్‌ కు చదరపు గజానికి రూ.77 వేలు పలికింది. ఆ తర్వాత  రెండో సెషన్‌లో రూ.1.01 లక్షల ధర పలికింది. మొత్తం మీద ఉప్పల్ భగాయత్‌లో ఈ మూడో విడత వేలంలో యావరేజ్‌ మీద గజానికి రూ.71,815 ధర వచ్చిందట. ఈ మూడో దశలో మొత్తం 44 ప్లాట్లకు వేలం వేశారు. ఫస్ట్ రోజు 23 ప్లాట్లకు వేలం ముగిసింది. మొదటి రోజు మొత్తం 19 వేల చదరపు గజాలు వేలంలో అమ్ముడుపోయాయి.. ఈ భూమికి రూ.141.61 కోట్ల ఆదాయం వచ్చింది.


ఇంకా మిగిలిన 1.15 లక్షల చ.గజాలకు శుక్రవారం వేలం జరగుతుంది. ప్రస్తుతం వచ్చిన రేట్ల ప్రకారం..చూసినా మొత్తం రూ.900 కోట్లు ఆదాయం ఖాయమని హెచ్‌ఎండీఏ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో వేసిన వేలంలో అత్యధికంగా 80 వేలు గజం రాగా.. ఇప్పుడు అది గజం లక్షకు చేరిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: