ఏపీలో ఉద్యోగులు సమరానికి సిద్దమవుతున్నామని మొన్న ప్రకటించారు. జగన్ సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడం లేదని.. కనీసం జీతాలు కూడా సమయానికి రావడం లేదని అంటున్నారు. ఈ మేరకు తమ ఉద్యమ కార్యాచరణను మొన్న ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఉద్యోగుల సదస్సులు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే... ఈ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకోగలుగుతాయా అన్నది సందేహాస్పదమే.


ఈ నేపథ్యంలో ఇవాళ నేడు ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని ప్రభుత్వం నిర్వహిస్తోంది. పీఆర్సీతో పాటు ఇతర అంశాలపైనా ఉద్యోగ సంఘాలతో కౌన్సిల్ చర్చించబోతోంది. ఈ భేటీకి హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి నుంచి ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు సమాచారం వచ్చింది. దీంతో చర్చలకు వెళ్లేందుకు ఉద్యోగుల సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు.


పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణపై నోటీసులిచ్చిన ఉద్యోగ సంఘాలు.. ఇవాళ ఏమేరకు తమ డిమాండ్లపై పట్టుబడతాయో చూడాలి. డిసెంబర్ 7 నుంచి నిరసనలకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన ఉద్యోగ సంఘాలు.. ఆ పోరాటానికి కట్టుబడి ఉంటాయా.. లేక.. ప్రభుత్వంతో చర్చలతో మెత్తబడతాయా అన్నది చూడాలి.


గతంలోనూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అల్టిమేటమ్‌ ఇచ్చి.. అదే ప్రెస్‌ మీట్‌లో సజ్జలకు ఫోన్‌ చేసి.. అబ్బే మేం మీ కంట్రోల్‌లోనే ఉంటాం సర్.. అని మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మరి ఈ సారి చర్చల్లో ఉద్యోగ సంఘాలు నేతలు ఏమేరకు తమ వాణి వినిపిస్తారో చూడాలి. జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సయోధ్యకు సిద్ధమవుతారా.. లేక జగన్‌తో సమరానికి సై అంటారా అన్నది తేలే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: