ఏపీ సీఎం జగన్ తెచ్చిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం ఇప్పుడు తెలుగు దేశం పార్టీకి అస్త్రంగా మారబోతోంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని క్రమబద్దీకరణ చేయించుకోని వారి కోసం జగన్ సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది. ఈ ఇల్లకు వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ కింద రూ. 10 వేలు కట్టేస్తే ఇంటిపై సర్వహక్కులు ఇస్తూ పట్టాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. గతంలో పాదయాత్ర సమయంలో ఈ మేరకు తాను హామీ ఇచ్చానని ఇప్పుడు దాన్ని అమలులోకి తెచ్చామని జగన్ అంటున్నారు.


అయితే.. ఇప్పుడు ఇదే వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని చంద్రబాబు తన ఎన్నికల అస్త్రంగా మలచుకుంటున్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్ళకి, ఇచ్చిన ఇంటి స్థలాలకు ఇప్పుడు పట్టా ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. తాను మళ్లీ సీఎం అయితే.. కేవలం నెల రోజుల్లోనే అన్ని ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అసలు పట్టాలకు 10 వేలు ఎందుకు కట్టాలని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇలా రూ. 10 వేలు వసూలు చేసేందుకు అసలు జగన్ కు  ఉన్నహక్కేంటని చంద్రబాబు అడుగుతున్నారు.


గతానికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు తన మాటల్లో స్టయిల్ మార్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా తాను సీఎం అయితే.. అనే విషయాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు. మళ్లీ తెలుగు దేశం అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతాను అనే విషయాన్ని బాగా వత్తి చెబుతున్నారు. మొన్న అసెంబ్లీలోనూ ఇదే జరిగింది. మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అని శపథం చేసి మరీ బయటకు వచ్చారు. బయట ప్రెస్ మీట్లోనూ ఇదే మాట చెప్పారు. ఇలా పదే పదే చంద్రబాబు తాను సీఎం అయితే.. అని చెప్పడం వెనుక కూడా ఓ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. లోకేశ్ ముఖ్యమంత్రి అవుతాడేమో అన్న ఆందోళన ప్రజల్లో ఉందని చంద్రబాబుకు కొన్ని సర్వేలు చెప్పాయట. అందుకే జనంలో ఆ  భయం పోగొట్టి.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతాననే విషయాన్ని కావాలనే చంద్రబాబు పదే పదే చెబుతున్నారంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: