ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అంశం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించి కొంతవరకు అభివృద్ధి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి తో పాటు విశాఖపట్నం - కర్నూలు కూడా ఉంటాయని జగన్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత మూడు రాజ‌ధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది.

అయితే వారం రోజుల క్రితం జగన్ ప్రభుత్వం అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే జగన్ మాత్రం తమ ప్రభుత్వం మూడు రాజధానులు కి కట్టుబడి ఉందని ... ప్రస్తుతం ఉన్న బిల్లులో ఉన్న లోపాలను సరిచేసి మరోసారి అసెంబ్లీ ముందు ఉంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాము తిరిగి మూడు రాజధానులు బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు.

ఈ విషయమై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే మార్చిలో 3 రాజధానుల కొత్త బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెడుతుందని చెప్పారు. దీనిని బట్టి చూస్తే మూడు రాజధానుల కొత్త బిల్లుకు సంబంధించి ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టు అర్థమవుతోంది. ఈ పాత బిల్లులో మార్పులు చేర్పులు చేసి నాలుగు నెలల సమయం తీసుకుని అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మ‌రి మార్చి లో మూడు రాజ‌ధానుల కొత్త బిల్లు వ‌స్తుందా ?  దీని వెన‌క ఎన్ని ట్విస్టులు ఉంటాయి. అప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ బిల్లు ప్ర‌వేశ పెట్టి చ‌ర్చ జ‌రిగేంత టైం ఉంటుందా ? అస‌లు టీడీపీ వాళ్లు అప్పుడు అసెంబ్లీకి వ‌స్తారా ?  రారా ? అన్న‌ది మాత్రం సందేహ‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: