మరో నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన పార్టీ నేతలు. అధికారం నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే...  ఎలాగైనా అధికారం హస్తం పార్టీ నుంచి లాగేసుకుంటామని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఆ పార్టీ అగ్రనేతలకు తలనొప్పిగా మారింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కారణంగా హస్తం పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై ఓ రేంజ్‌లో యుద్ధం చేశారు సిద్ధు. చివరికి ఈ పంచాయతీ కాస్తా హస్తినకు చేరుకుంది. చివరికి తన పదవికి కెప్టెన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. బీజేపీలో చేరతారని అంతా భావించినా కూడా... చివరికి సొంత పార్టీ పెట్టేందుకు కెప్టెన్ అమరీందర్ సింగ్ మొగ్గు చూపారు.

ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం పొత్తుల కోసం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్లాన్ వేస్తున్నారు. ఏబీపీ - సర్వే రిపోర్టు ప్రకారం పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు. ఇందుకు ప్రధానంగా కేంద్రం గతేడాది తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలే. దీంతో గత నెల 19వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లులు కూడా రద్దు చేశారు. దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కెప్టెన్ రెడీ అయ్యారు. హస్తం పార్టీ రాజీనామా చేసిన వెంటనే ముందుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతా బీజేపీలో చేరినట్లే అని కూడా భావించారు. కానీ లేదని తేల్చేశారు. ఇప్పుడు తానే సొంత పార్టీ పెట్టేశారు కెప్టెన్... ఇప్పుడు తాజాగా బీజేపీతో మిలాఖత్ అయ్యేందుకు మరోసారి హస్తిన బాట పట్టారు. పొత్తు కోసం కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రేపు ఉదయం ప్రత్యేకంగా భేటీ కానున్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి: