వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతుల నిరీక్షణ చేస్తున్నార‌ని, పంట కొన‌కుండా రైతుల‌ను కాటికి పంపుతున్నారంటూ వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధాన్యం కొనుగోలు మ‌రోసారి స్పందించిన ఆమె తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరిగారు. ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది కాక యాసంగి వడ్ల కొనుగోలు మీద రాజకీయాలు చేస్తున్నారు అంటూ తీవ్రంగా మండిప‌డ్డారు.



  మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్య‌క్తం చేశారు.  ఇవాళ మరో ఇద్దరు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని.. ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు..? అంటూ దుయ్య‌బ‌ట్టారు.  ఇంకెంత మందిని బలితీసుకొంటారు ? అని ప్ర‌శ్నించారు.  రైతులను కోటీశ్వర్లుగా తీర్చి దిద్దుతాం, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు.  రైతులు కోటీశ్వరులు కావడం కాదు.. మీరు ఉరి కొయ్యల‌కు ఉరి వేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.  


   అయితే, ధాన్యం కొనుగోలు విష‌యంలో  వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే పిచ్చోడి చేతిలో రాయిలా చేశార‌ని మండిప‌డ్డారు . కేసీఆర్ చేత‌కాని ప‌రిపాల‌న కార‌ణంగా విద్యుత్తు సంస్థ‌ల‌ను, ఆర్టీసీ సంస్థ‌ల‌ను న‌ష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నార‌ని,  ఆ న‌ష్టాల‌ను పూడ్చ‌డానికి ఇప్పుడు బ‌స్ టికెట్ చార్జీలు, విద్యుత్ బిల్లులు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: