జవాద్ తుఫాను ప్రభావంపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖా, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. పలాస నియోజకవర్గం మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల తహశీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కమీషనర్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి అప్పలరాజు. జవాద్ తుఫాన్ తీవ్రత, వాటి నుండి ప్రజలకు ఎదురౌతున్న నష్టంపై అంచనా వేయాలని కోరారు. మందస మండలంలో ఆరు, పలాస మండలంలో నాలుగు, వజ్రపుకొత్తూరు మండలంలో పది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు మంత్రికి తెలిపారు. జవాద్ తుఫాను ప్రభావంతో వర్షాలు భారీ స్థాయిలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపద్యంలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజల భద్రత కోసం చర్యలు చేపట్టాలని కోరారు.

అధికారులు గ్రామ స్థాయిలో సెక్రేటరీలు, వీఆర్వోలు ఇతర సిబ్బంది కూడా స్థానికంగా ఉండి తుఫాను పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు.  రైతులు పండించే పంటలపై తుఫాన్ ప్రభావం చూపుతుందని తుఫాన్ అనంతరం వాటిని తిరిగి మనకు మనమే  సంరక్షణ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ప్రజలు ఎవరూ అనవసరంగా ఆతృతగా బయటకు వచ్చి ప్రమాదంలో చిక్కుకోవద్దని మంత్రి సూచించారు. ఈ రోజు రాత్రికి వర్షాలు పడే సూచన కనిపిస్తున్న తరుణం...  అనంతరం తుఫాన్ తీరం దాటిన తరువాత తీసుకోవలసిన చర్యలు పట్ల పూర్తి స్థాయిగా అధికారులు సన్నద్దం కావాలని ఆదేశించారు. విపత్తును ధైర్యంగా ఎదుర్కోవడం తోపాటు ప్రణాళిక బద్ధంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని  మంత్రి కోరారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: