లోక్ సభ, రాజ్యసభలో ఈ రోజు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం తన పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా సీబీఐ పరిధిని పెంచేందుకు ఉద్దేశించిన ఢిల్లీ పోలీసుల చట్ట సవరణ బిల్లును కేంద్రం ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్.... సీబీఐ ఎంట్రీని తమ రాష్ట్రాల్లోకి లేకుండా గతంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిషేధ ఆజ్ఞలు విధించారు. దీంతో సీబీఐ పరిధిని మరింత పెంచేందుకు కేంద్రం తాజా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇక వరుసగా ఐదవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి... టీఆర్ఎస్ ఎంపీలు... వరిధాన్యం కొనుగోలుపై మరోసారి తమ గళం విప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో గులాబీ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని... నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.

ఇక పెద్దల సభలో అయితే నాలుగు రోజులుగా అదే పరిస్థితి. ఎంపీల సస్పెన్షన్‌పై ఈ రోజు కూడా రాజ్యసభలో నిరసనలు కొనసాగాయి. ఇక వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మూడు ప్రైవేటు మెంబర్ బిల్లులను పెద్దల సభలో ప్రవేశపెట్టారు. ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడే వారికి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా చట్టాలు సవరించాలని విజయసాయిరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ఇక ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో... ఏపీ నుంచి 11 వేల 939 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయన్నారు. 2020-21 నాటికి ఈ ఎగుమతుల విలువ మరో 5 వేల కోట్లకు పెరిగినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల్లో ప్రధానంగా ఆక్వా, ఫార్మా, డ్రగ్స్, కెమికల్స్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఉన్నాయన్నారు. దేశంలో ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే మేజర్ వాటా అని కూడా పెద్దల సభలో కేంద్ర మంత్రి ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: