తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, ఆ పార్టీ నేతలపైన ఒంటికాలితో దూకుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఒక రేంజ్‌లో కామెంట్లు చేశారు కొడాలి. చివరికి ఆయన ప్రెస్ మీట్ అంటే... ఏం మాట్లాడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి. చివరికి ఆయనకు టీడీపీ నేతలంతా కలిసి బూతుల మంత్రి అంటూ పేరు కూడా పెట్టేశారు. అయినా సరే... ఆయన మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే రేంజ్‌లో అటు అసెంబ్లీలో, ఇటు బయట ప్రెస్ మీట్‌లో కూడా తమ మాటలతో చెలరేగిపోతున్నారు కొడాలి నాని. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. అలాగే చంద్రబాబు పై కూడా మరోసారి తన రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి.

తనపైన, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపించారు. ఇవన్నీ కూడా లోకేష్ దగ్గరుండి చేయించారన్నారు కొడాలి నాని. ఇలాంటి వారిని ఏం చేయాల్లో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఏమైనా అనొచ్చా అని నిలదీశారు. అసలు వంశీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.... అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు మాత్రమే అని కొడాలి నాని వెల్లడించారు. లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి చంద్రబాబు మాత్రమే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తాడమే భయంతోనే లోకేష్‌ను చంద్రబాబు ఓడించాడన్నారు. రాజకీయంగా ఎదగడం కోసం వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు అలవాటే అన్నారు కొడాలి నాని. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చారన్నారు. గత ఎన్నికల్లో కూడా లోకేష్‌ గెలిస్తే తనకు సీఎం పదవి దక్కదనే భయంతోనే ఓడించినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. జగన్‌ను గాల్లో వస్తాడు... గాల్లో పోతాడు అని వ్యాఖ్యానించడం వెనుక అర్థం ఏమిటో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: