ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి కేంద్రం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల మధ్య నిప్పు రాజేసింది. ఏకంగా పార్లమెంటులో ఈ అంశంపై వాదోపవాదాలు జరిగాయి. టీఆర్ఎస్ ఎంపీలు.. అసలు బాయిల్డ్‌ రైస్ కొంటారా.. కొనరా తేల్చి చెప్పండని పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను నిలదీశారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. అయితే దీనిపై స్పందించిన పీయూష్‌ గోయల్‌ తిరిగి టీఆర్ఎస్‌ ఎంపీలనే ఇరుకున పెట్టేశారు.


అసలు బాయిల్డ్ రైస్ కొనబోమని తాము ముందే చెప్పామని రాజ్యసభలో ప్రకటించారు. ఈ విషయాన్ని ఒప్పుకుంటూ తెలంగాణ తమకు లేఖ కూడా రాసిందని.. ఆ లేఖను పీయూష్ గోయల్ రాజ్యసభలో చూపించారు. ప్రతి రాష్ట్రంతో కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఒప్పందాలు చేసుకుంటుందని.. తెలంగాణ విషయంలోనూ అలాగే ఒప్పందం చేసుకుందని.. ఆ ఒప్పందాన్ని తెలంగాణ పాటించకుండా అడ్డం తిరుగుతోందని పీయూష్ గోయల్ అన్నారు.


ముందు తెలంగాణ నుంచి కేంద్రానికి పంపాల్సిన పెండింగ్ ధాన్యం పంపకుండా.. రాబోయే పంట కొంటారా లేదా అని ప్రశ్నించడం ఏంటని పీయూయ్ గోయల్ ఎదురు దాడి చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తుందంటూ పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో టీఆర్ఎస్‌ ఎంపీ  కేకే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌  సమాధానం ఇచ్చారు.


ముందు.. తెలంగాణ సర్కారు ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం సేకరణ గురించి ఆలోచించాలని ఆ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దామని పీయూష్‌ గోయల్ సూచించారు. అయితే.. యాసంగిలో తెలంగాణలో కేవలం బాయిల్డ్ రైస్‌ మాత్రమే వస్తాయన్న కేకే.. వాటిని కొంటారో లేదో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒకవేళ బాయిల్డ్ రైస్‌ కొనేటట్లు అయితే ఎంత కొంటుందో క్లారిటీ ఇవ్వాలని.. దాన్ని బట్టి తాము రైతులకు చెప్పుకుంటామని కేకే అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr