ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ఎంత బలమైన నాయకుడో అందరికీ తెలిసిందే. విజయనగరం జిల్లాని శాసించే శక్తి గల నేత...అలాంటి నాయకుడుని ఓడించాలంటే ఎంత కష్టమో కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ బొత్సకు చెక్ పెట్టడానికి కిమిడి నాగార్జున మాత్రం కష్టపడుతున్నారు. తనకు సాధ్యమైన మేర బొత్సకు ధీటుగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మామూలుగానే చీపురుపల్లి అంటే బొత్స కంచుకోట. ఇక్కడ మరొక పార్టీ గెలుపు ఊహించడం చాలా కష్టం.

అయితే బొత్స ఎంట్రీకి ముందు..చీపురుపల్లి టీడీపీకి కంచుకోటగానే ఉండేది. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు చీపురుపల్లిలో టీడీపీ గెలిచింది. ఇక బొత్స ఎంట్రీతో సీన్ మారిపోయింది. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి వరుసగా గెలిచారు. అంతకముందు 1999 ఎన్నికల్లో టీడీపీ గాలిలో సైతం కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చి వరుసగా గెలిచారు. అలాగే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే.

కానీ రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌కు ఎంత నష్టం జరిగిందో కూడా తెలిసిందే. ఆ సమయంలో కూడా బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేసి, 2014 ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. అయితే కాస్త టీడీపీకి అవకాశం దొరకడంతో చీపురుపల్లిలో కిమిడి మృణాలిని విజయం సాధించారు. ఇక ఈమె కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలోచ్చేసరికి బొత్స వైసీపీ నుంచి బరిలో దిగగా, టీడీపీ నుంచి మృణాలిని తనయుడు నాగార్జున పోటీ చేశారు. ఇక బొత్స ముందు నాగార్జున నిలబడలేకపోయారు.

ఇప్పటికీ కూడా చీపురుపల్లిలో నాగార్జునకు ఏ మాత్రం ఛాన్స్ దొరకలేదు. పైగా బొత్స మంత్రిగా ఉన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పరిస్తితులు తారుమారైన సరే చీపురుపల్లిలో బొత్సని ఓడించడం నాగార్జునకు కష్టమే అని చెప్పాలి. ఒకవేళ నాగార్జున సేఫ్ సైడ్‌గా సీటు మార్చుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: