మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. రోశయ్య అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన రూపం.. అచ్చమైన పంచె కట్టుతో ఆయన నిలువెత్తు తెలుగు తనంతో ఉట్టిపడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాత తరం రాజకీయ నేతల చివరి ప్రతినిధిగా రోశయ్యను చెప్పుకోవచ్చు. రోశయ్య పాత తరం విలువలు పాటించిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. పార్టీ అంటే తల్లిలా భావించిన నాయకుడు.


రాజకీయ నేతల్లో చాలా మందికి పార్టీలు జీవం ప్రసాదిస్తుంటాయి. పార్టీ లేకపోతే.. చాలా మంది నాయకులతో జీవితం ఉండదు. పార్టీ పేరు చెప్పుకుని పొలిటికల్ లైఫ్ లాగిస్తుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే పార్టీకే భరోసా ఇస్తుంటారు. అలాంటి కొద్ది మందిలో రోశయ్య ఒకరు. శాసనస సభలోనూ రోశయ్యది ప్రత్యేక ముద్ర. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రోశయ్య అసెంబ్లీకి వస్తున్నాడంటే.. ఆ క్రేజే వేరుగా ఉండేది. ఏ విషయంపైనైనా సాధికారికంగా మాట్లాడగలిగిన సబ్జక్ట్ ఉన్న నాయకుడు రోశయ్య.


ఎదుటి పార్టీ వాదనను రోశయ్య అసెంబ్లీలో ఖండఖండాలుగా ఖండించేవాడు.. ఏది మాట్లాడిన సరైన సమాచారంతో లాజిక్‌తో అలరించేవాడు.. అందుకే రోశయ్య అంటే ప్రత్యర్థి పార్టీలకు హడల్ గా ఉండేది. ఇక వైఎస్ఆర్ వంటి ముఖ్యమంత్రులకు రోశయ్య పెద్ద పెన్నిధి.. అంతే కాదు.. రోశయ్య సీనియర్, జూనియర్ అనే బేధాలు చూపించేవారు కాదు. పార్టీ ఏం చెబితే అది చేయడమే తన  పని అనుకునే అచ్చమైన కార్యకర్త కొణిజేటి రోశయ్య.


రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడం అనే స్థాయికి పడిపోయిన ఈ నాటి నేతలకు రోశయ్య జీవితం ఓ పాఠంగా చెప్పుకోవచ్చు. అధికారం అంటే సంపద కూడబెట్టుకోవడంగా మారిన ఈ నాటి నేతలకూ కొణిజేటి రోశయ్య జీవితం ఓ పాఠమే. రోశయ్య మరణంతో విలువలతో కూడిన రాజకీయం అనే అధ్యాయం తెలుగు రాజకీయాల్లో ముగిసిపోయిందేమో అనిపించిందంటే.. అతిశయోక్తికాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: