కొణిజేటి రోశయ్య.. సుదీర్ఘ కాలంపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఆయన అనేక శాఖలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర, రికార్డు కొణిజేటి రోశయ్యదే. అయితే.. ఆయన పార్టీలో ఎప్పుడూ నెంబర్ టూ గానే ఉండిపోయారు. ముఖ్యమంత్రులకు నమ్మినబంటుగా ఉండటమే తప్ప.. సొంతంగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. వర్గ రాజకీయాలను ఆయన నమ్ముకోలేదు.. ఈ కారణంగానే కావచ్చు.. ఆయన తన రాజకీయ జీవిత చరమాంకంలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అది కూడా ఆనాటి సీఎం వైఎస్సార్ హఠాన్మరణంతో అనుకోకుండా ఆయన్ను సీఎం పదవి వరించి వచ్చింది.


అయితే.. ఆయన సీఎం అయ్యేనాటికే ఆయన వయోవృద్ధుడయ్యారు. దీనికితోడు.. వైఎస్సార్ కాలంలో స్తబ్దుగా ఉన్న తెలంగాణ ఉద్యమం.. రోశయ్య సీఎం కావడంతో మరోసారి రాజుకుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. వైఎస్‌ చనిపోయేనాటికి అప్పటి రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యమే ఉండేది. టీఆర్‌ఎస్‌ మహాకూటమిలో చేరి అతి తక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని చతికిలపడింది.


అలాంటి స్థితిలో రోశయ్య సీఎం కావడంతో మరోసారి తెలంగాణ ఉద్యమం పుంజుకుంది. పోలీస్‌ శాఖలో ఉన్న ఫ్రీజోన్ నిబంధన ఎత్తేయాలంటూ మొదలైన ఆందోళన క్రమంగా ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నికల్లో దారుణ ఓటమితో తీవ్ర నిరాశలో చిక్కుకున్న కేసీఆర్.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ ను రాజేసేందుకు ఆయన నవంబర్‌లో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆ తర్వాత ఆమరణ దీక్షలో అనేక పరిణామాలు చోటు చేసుకుని చివరకు నిమ్స్‌కు కేసీఆర్‌ను తరలించడం జరిగిపోయాయి.


కేసీఆర్‌ నిమ్స్‌లో చేరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ పరిస్థితులను రోశయ్య సరిగ్గా నిర్వహించలేకపోయారన్న వాదన ఉంది. ఇక హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని రోశయ్య హైకమాండ్‌కు చెప్పడంతో డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆనాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు బీజం వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: