ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే కాదు... ప్రపంచంలో కూడా ఓ తిరుగులేని నేతగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుస విజయలాతో దూకుడు మీదున్న నరేంద్ర మోదీని ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ... ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం... తిరుగులేని మెజారిటీతో.. పార్లెమెంట్‌లో ఏకంగా 300 పైగా స్థానాలను సొంతం చేసుకుంది. ఇందుకు ప్రధాన కారణం నరేంద్ర మోదీపై ప్రజల్లో నమ్మకమే అని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇటు ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో కూడా ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలో రికార్డు మెజారిటీతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి రాక ముందు పాదయాత్ర సమయంలో ప్రజల బాధలను స్వయంగా తెలుసుకున్న జగన్... తమ పార్టీ అధికారంలోకి వస్తే... అమలు చేసే పథకాలను నవ రత్నాల రూపంలో ప్రకటించారు. వీటిల్లో ప్రధానమైనది అమ్మ ఒడి.

పిల్లల్లో అక్షరాస్యతా శాతం పెంచేందుకు అమ్మ ఒడి పేరుతో నేరుగా విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. అయితే ఈ పథకాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇందుకు అనుగుణంగా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. జగన్ తన అజెండాలోని అంశాల్ని... మోదీ సర్కార్ దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరడం ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపితే... ఈ పథకం అమలుకు కేంద్రం చర్యలు ప్రారంభించాలి. ఇలా జరిగితే... రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ పథకం కూడా  దేశ వ్యాప్తంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరలేదు. గతంలో వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కూడా... అంతకు ముందు కర్ణాటకలో యశస్వీ పేరుతో అమలులో ఉన్నదే. ఇలాంటి సమయంలో వైసీపీ తాజాగా ఈ డిమాండ్ ఎందుకు తెరపైకి తీసుకువచ్చిందనే చర్చ సొంత పార్టీలోనే జోరుగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: