వానొచ్చిన ప్ర‌తీ సారి ఆనందం ఒకింత కూడా క‌ల‌గ‌దు మా ప‌ల్లెకు మా ప‌ట్ట‌ణానికి. ఎందుకంటే వానొస్తే అవి స‌కాలంలో వ‌చ్చిన‌వి కావు ఏవో అకాల వాన‌లు మా గుండె మీద త‌న్ని పోతున్నాయి. నీరే అది కానీ నిప్పుల వాన‌లా ఉంది. నీరే అది స‌క‌ల విల‌యాలకూ ఆనవాలుగా ఉంది. అందుకే జ‌వాద్ తుఫాను అంటే భ‌య‌ప‌డిపోతున్నాం. రేప‌టి మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఈ భ‌యం ఇలానే ఉంటుంది. ఒక‌వేళ రేప‌టి మ‌ధ్యాహ్నం త‌రువాత తుఫాను తీరం దాటితే పంట న‌ష్టం ఏంట‌న్న‌ది తేలిపోతుంది. అందాక మాకు మాన‌సిక ఒత్తిడి త‌ప్ప‌దు. మాకు అన‌గా మా శ్రీ‌కాకుళం ప్ర‌జ‌ల‌కు మ‌రియు మాకు అనగా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు అని అర్థం.



తుఫాను వ‌చ్చిన ప్ర‌తిసారీ మా తీరం వ‌ణికిపోతోంది. తుఫాను రాక‌ల్లో మా ఊరు ఎన్నోసార్లు హ‌డ‌లి పోయింది. మా ఊరు అంటే మా శ్రీ‌కాకుళం అని అర్థం. తుఫాను వ‌చ్చిన ప్ర‌తిసారీ మాకెన్నో దుఃఖాలు ఉంటున్నాయి. తుఫాను వ‌చ్చి వెళ్లాక మాకు రాజ‌కీయ ప‌రా మర్శ‌లు త‌ప్ప ఒరిగిందేమీ లేదు. జ‌వాద్ తుఫాను కార‌ణంగా మాలో భ‌యాలు ఉన్నాయి. దేవుడి క‌రుణ కారణంగా ఇప్ప‌టికైతే పె ద్ద పెద్ద‌గా వాన‌లు లేవు. తేలిక‌పాటి వాన‌లు మాత్ర‌మే ఉన్నాయి. ఓ విధంగా మేం సేఫ్ అని కూడా అనుకోవాలి ప్ర‌స్తుతానికి. అయిన‌ప్ప‌టికీ మాలో భ‌యాలో ఆందోళ‌న‌లో అలానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న విషాద సంద‌ర్భాలు అలాంటివి క‌నుక‌!



గులాబ్ తుఫాను ప‌రిహారం అంతంత మాత్ర‌మే అందింది ఈ ప్రాంతానికి. ఆ తరువాత కొద్ది రోజుల‌కే అల్ప‌పీడ‌న ప్రభావంతో వాన‌లు వ‌చ్చాయి. వ‌రుస వాన‌ల కార‌ణంగా పంట‌లు పోయాయి. కొన్ని చోట్ల తీవ్ర నిరాశ త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు. ఇవ‌న్నీ త‌ల్చుకుని త‌ల్చు కుని మా ఊరు  గుండె దిటువు చేసుకుని బ‌త‌క‌డం ఎలానో మ‌రిచిపోయింది. మాతో పాటే విజ‌య‌న‌గ‌రం, మాతో పాటే విశాఖ కూ డా ఏటా ఇలానే నష్ట‌పోవ‌డంతో క‌ష్టం ఎవ‌రికి చెప్పుకోవాలి అన్న‌ది ఓ అగ‌మ్య గోచ‌ర స్థితిలా ఉంది మాకు. తుఫాను ఉత్త‌రాంధ్ర‌తో పాటు ఒడిశాలోని నాలుగు జిల్లాల‌ను అత‌లాకుత‌లం చేయ‌నుంద‌ని వార్త‌లొచ్చాయి. ఇప్ప‌టికైతే శ్రీ‌కాకుళ న‌గ‌రాన భారీ వాన‌లు లేవు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోలేదు. గాలులు లేని కార‌ణంగా విద్యుత్ సర‌ఫ‌రాకు అంత‌రాయం రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: