భారత దేశం భాగ్యవిధాత.. ఇది చెప్పుకునేందుకు బాగానే ఉంటుంది. భారత దేశం భాగ్య సీమరా.. అని పాడుకునేందుకు బాగానే ఉంటుంది. కానీ వాస్తవం అలా ఉందా.. దేశంలో బిలియనీర్లు ఓవైపు పెరిగిపోతుంటే.. అదే స్థాయిలో ఆకలి చావులూ పెరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం కనిపించడమే లేదు. ఇందుకు ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తున్న ఆకలి సూచీలే ఉదాహరణగా చెప్పొచ్చు. ఐక్య రాజ్య సమితి ఏటా ఈ ఆకలి సూచీని విడుదల చేస్తుంటుంది. మొత్తం 135 దేశాల్లోని పరిస్థితులు గమనించి పరిశీలించి ఐక్య రాజ్య సమితి ఈ సూచీలు విడుదల చేస్తుంటుంది.


ఇలాంటి సూచీల్లో భారత్ కింది నుంచి 36 వ స్థానంలో నిలవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే.
మొత్తం 135 దేశాల్లో భారత్‌ ర్యాంకు 101 కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగున ఉన్నది సోమాలియా. పాపం.. ఈ దేశం గత ఇరవై ఏళ్లుగా ఆకలి సూచీలో ఆఖరి స్థానంలోనే ఉంటోంది. 2000 నుంచి సోమాలియా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇక ఆ తర్వాత దారుణంగా ఉన్న దేశాలు యెమెన్‌, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చాడ్‌ వంటి దేశాలదీ అదే పరిస్థితి. వీటితో పాటు డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ద కాంగో, మడగాస్కర్‌, లిబేరియా, హయతి, టిమోర్‌- లెస్టే, సియెరా లియోన్‌, మొజాంబిక్‌ కూడా కాస్త మెరుగ్గా అనిపించినా చివరి స్థానాల్లోనే ఉన్నాయి.


ఇలాంటి దేశాలంత దారుణంగా లేకపోయినా ప్రపంచంలోని 135 దేశాల్లో 101వ స్థానం అంటే అది భారత్ పరువు తీసేదే. విచిత్రం ఏంటంటే.. ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో తొలి రెండు స్థానాలూ ఇండియన్లవే.  బ్లూమ్‌బర్గ్‌ లెక్కల ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ నికర సంపద 100 బిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపు రూ.7,50,000 కోట్లు అన్నమాట. అలాగే అదానీ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర సంపద సుమారు రూ.5.5 లక్షల కోట్లుగా తేలింది. అంటే  వీళ్లిద్దరి సంపద కలిపితేనే రూ.13 లక్షల కోట్లు అన్నమాట.  అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చూసినా 100 లోపు ర్యాంకుల్లో కూడా మన ఇండియన్లు కనిపిస్తారు. అంటే ఇండియాలో ధనవంతులకు కొదువ లేదన్నమాట. అయినా ఇండియాలో ఇంకా ఆకలి బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆకలి సూచీలో మన దేశం ఇంకా  దారుణమైన స్థితిలో ఉందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: