రోజు రోజుకీ పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులతో భారత్ లో థర్డ్ వేవ్ భయం పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ ఒమిక్రాన్ కేసులు 21కి చేరుకున్నాయి. కొత్తవేరియంట్ సోకిన రాష్ట్రాల సంఖ్య 5కి చేరింది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా.. కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 17 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్లో ఒకే కుటుంబానికి చెందిన 9మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకగా.. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. నిబంధనలు కఠినతరం చేసింది. అటు కర్నాటకలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడినరోజే.. ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లో తిరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించుకోకపోతే పిల్లలకు స్కూల్ లో నో ఎంట్రీ అని చెప్పేసింది. ఒమిక్రాన్ భయంతో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాయి.

నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చేనా..?
కరోనా కేసులు పెరుగుతున్నాయంటే గతంలో కేంద్రం చేసిన మొట్టమొదటి పని నైట్ కర్ఫ్యూ. రాత్రివేళ వాహనాల రాకపోకలు, జన సంచారాన్ని అరికట్టాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కర్ఫ్యూ టైమింగ్స్ ని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా థర్డ్ వేవ్ మొదలైందనే ప్రచారం ఊపందుకుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావం బాగా కనిపిస్తుందని, ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్టానికి పెరగొచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మునీంద్ర అగర్వాల్ చెప్పారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ తో పెద్దగా నష్టం జరక్కపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే.. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్టానికి చేరుకునే అవకాశం ఉంటే.. కచ్చితంగా జనవరి నుంచే నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ రెండో వారంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుదలను బట్టి కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నా.. కర్ఫ్యూ ఎక్కడా లేదు. ఒమిక్రాన్ కేసులు పెరిగితే మాత్రం కచ్చితంగా నైట్ కర్ఫ్యూ అమలులోకి రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: