తిరుమల.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఎత్తైన ఏడుకొండలు.. ఘాట్ రోడ్లు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో టీటీడీ రంగంలోకి దిగింది. వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఘాట్ రోడ్డులో మరమ్మతులు చేయాలంటే నిపుణులు అవసరం కావడంతో ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందాన్ని రప్పించింది. ఈ నిపుణుల బృందం ఘాట్ రోడ్డును పరిశీలించి టీటీడీకి నివేదిక ఇవ్వనుంది. తాజాగా కేరళ రాష్ట్రం, కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి మరో నిపుణుల బృందాన్ని రప్పించారు. కొండచరియలు విరిగి పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వీరి నుంచి సూచనలను కోరుతున్నారు.

తిరుమల ఘాట్ రోడ్డు నిర్మించి ఇప్పటికి దాదాపుగా 76 ఏళ్ళు గడిచింది. మొత్తం 22 కిలోమీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు, ఎన్నో మలుపులతో సాగుతుంది. తిరుమల ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ఘాట్ రోడ్డును నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరని ఘాట్ రోడ్డు మనకు దర్శనమిస్తుంది. అయితే ఇటీవల వరుసగా కొండచరియలు విరిగి పడటం టీటీడీకి తలనొప్పిగా మారింది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని టీటీడీ ఆలోచిస్తోంది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన నిపుణులను టీటీడీ సంప్రదిస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

తిరుమల చరిత్రలో ఇప్పటి వరకూ, ఎప్పుడూ ఇలాంటి విపత్తు రాలేదు. దీంతో టీటీడీపై విమర్శలు రాకుండా పక్కాగా ఉండేందుకు అన్ని బృందాలతో పరిశీలన చేయిస్తోంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరక్కుండా, భవిష్యత్ లో ఇబ్బందులు లేకుండా చేయాలనుకుంటోంది. అందుకే ఇలా ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందంతో పాటూ.. కేరళలోని కొల్లం బృందాన్ని కూడా రప్పించింది. ఈ బృందాలన్నీ తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించి, పూర్తి నివేదిక ఇచ్చాక టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించనుంది. భారీ వర్షాలు కురిసినా ఘాట్ రోడ్డుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భారీ కసరత్తే ప్రారంభించింది టీటీడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: