తమిళనాడు సీఎం స్టాలిన్ సరికొత్త నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ తమిళ తంబీలతో శభాష్ అనిపించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఏపీ సీఎం జగన్ కు స్టాలిన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే తమిళ భాషలో 40శాతం మార్కులు రావాలనే కొత్త నిబంధనను తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ మీడియం వెంట పరుగులు తీస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం ఇరుకునపడేసింది.

తమిళ భాష ఉనికిని కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందరూ ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపుతుండటంతో, తమిళ భాషను కాపాడుకునేందుకు తమిళనాడు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో తమిళ భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇరుకున పడేసింది. ఇప్పటికే సీఎం జగన్ తెలుగు భాషను పక్కనబెట్టి, ఇంగ్లీష్ మీడియం ముద్దంటూ పాఠశాలల్లో పాఠాలు మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు తెలుగు భాషాభిమానులందరూ తమిళనాడు ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకుంటోందంటూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన మంచి కార్యక్రమాలను తమిళనాడు సీఎం స్టాలిన్ యధావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ కొనసాగిస్తుండగా, ఏపీలో మాత్రం అన్నా క్యాంటీన్లను ఎత్తేశారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అప్పట్లో జయలలిత ప్రభుత్వం ఉండగా తయారు చేయించిన బ్యాగులనే పంపీణీ చేయించి శభాష్ అనిపించుకున్నారు. వరదల సమయంలోనూ పర్యటించి ప్రజలు మన్ననలు చూరగొన్నారు. ఇలా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ పాలన సాగిస్తున్నారు. దీంతో స్టాలిన్ చేస్తున్న కార్యక్రమాలన్నిటినీ ఏపీతో పోలుస్తూ మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఇవన్నీ ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందిగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: