యాసంగి పంట వ్యవహారం తెలంగాణ రైతులకు అశనిపాతంలా మారే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రైతులకు క్లిష్ట పరిస్థితులు తప్పేలా లేదు. ఖరీఫ్ పంట ఇంకా కల్లాల్లోనే ఉంది. దీనిని ఇంకా రైతులు పూర్తిస్థాయిలో అమ్మలేదు కూడా. ఇదే సమయంలో యాసంగి పంట గురించి రైతులకు వార్నింగ్ ఇచ్చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైతులు ఎవరూకూడా యాసంగిలో వరి పండించవద్దని టీ సర్కార్ తేల్చేసింది. యాసంగిలో రైతులు సాగు చేసే వరి పంటను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనేది లేదని తేల్చేశారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవన్నారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో వరి సాగు చేస్తే మాత్రం..... ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని హెచ్చరించారు కూడా నిరంజన్ రెడ్డి. రైతులు ఎవరూ కూడా కోరి కష్టాలు తెచ్చుకోవద్దని.. యాసంగిలో వరి పంట వేసి నష్టపోవద్దంటూ సలహా కూడా ఇచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు వరి పంటకే భూములు సారవంతంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యామ్నాయ పంటలు సాధ్యమేలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రత్యామ్నాయంగా ఏ పంట సాగు చేయాలనే విషయంపై కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంట సాధ్యమేనా అనేది రైతుల మదిలో ఉన్న పెద్ద ప్రశ్న. చివరి నిమిషంలో రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఇప్పటి నుంచే తెలంగాణ సర్కార్ జాగ్రత్త పడుతోంది. అందుకే యాసంగి పంట కొనుగోలుపై ఇప్పటికే మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితికి కారణం తాము కాదనే విషయాన్ని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి పదే పదే వెల్లడించారు. యాసంగి పంట ధాన్యం సేకరణకు కేంద్రమే విముఖత చూపుతోందని... ఇందుకు ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పారీలదే బాధ్యత అని అన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణపై కేంద్రంతో కేసీఆర్ స్వయంగా చర్చలు జరిపారని... కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఏ మాత్రం అంగీకరించలేదన్నారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: