భారతదేశం, రష్యా దేశాల మధ్య బంధం బలమైనదని భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కితాబిచ్చారు. రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్నారు మోదీ. 21వ వార్షిక భారత - రష్యా శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు పుతిన్. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై కీలకంగా చర్చలు జరిపారు ఇరు దేశాల అధినేతలు. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అయితే అన్ని సవాళ్లను ధీటుగా ఎదుర్కున్న తర్వాతే భారత్ - రష్యా బంధాల వృద్ధి వేగంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు మోదీ. వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతుందన్నారు మోదీ. కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచం అనేక ప్రాథమిక మార్పులను చూసిందన్నారు మోదీ. భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించినా కూడా... భారత్ - రష్యా మధ్య స్నేహం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నార మోదీ.

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్ - రష్యా స్నేహం గురించి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశాంతర స్నేహానికి భారత్ - రష్యా బంధం ఓ ప్రత్యేకమైన, నమ్మదగిన నమూనా అని మోదీ అభివర్ణించారు. భారత్ పట్ల మొదటి నుంచి ప్రత్యేకమైన ప్రేమాభిమానులతోనే రష్యా ఉందన్నారు మోదీ. కొవిడ్ సహా ఇతర ఎన్నో సవాళ్లను భారత్ - రష్యా దేశాలు సమగ్రంగా ఎదుర్కొన్నాయన్నారు. అలాగే కరోనా సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు మోదీ. అటు పుతిన్ కూడా భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహ పూర్వక దేశంగా, కాల పరీక్షకు తట్టుకున్న మిత్ర దేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు పుతిన్. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయని అన్నారు పుతిన్. భవిష్యత్తుపై రష్యా ఎంతో ఆశాజనకంగా ఉందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు దేసాల మధ్య రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో సహకారం మరింత పెరుగుతాయన్నారు పుతిన్.


మరింత సమాచారం తెలుసుకోండి: