దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ పోలవరం. ఆయన ఉన్నప్పుడు దానిని పూర్తిచేయాలని భావించారు. దానిద్వారా అనేక ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశించారు. అంతలోనే ఆయన అందరిని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటి నుండి పోలవరం వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. అనంతరం వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిని పూర్తి చేయలేక పోతున్నాయి. ఒకప్పటి బడ్జెట్ ఇప్పటి బడ్జెట్ లో తీవ్రంగా తేడాలు కూడా వచ్చేశాయి. దీనితో ఇన్నేళ్ళుగా ఆ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రం సిద్ధంగా ఉన్నప్పుడు కేంద్రం సహకారం సరిగా ఉండటం లేదు; కేంద్రం ఇచ్చే నిధులు కూడా తగిన మోతాదులో ఉండటం లేదు. విభజన లో భాగంగా ఈ ప్రాజెక్టు ను కేంద్రం చూసుకోవాల్సి ఉంది. కానీ అలాంటి చట్టాలకు తిలోదకాలు ఇచ్చేయడంతో, అటుఇటు కాకుండా వాయిదాలు పడుతూనే ఉంది.

ఇప్పటికి నిర్వాసితులకు సరైన న్యాయం చేయలేదు, ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా శాయశక్తుల వడ్డి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు నిధులు అడిగి సమయానికి పూర్తి చేయాలని 2022 ఏప్రిల్ అనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వలన ఆ లక్ష్యం నెరవేరడం కష్టం అని కేంద్ర వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క కరోనా, ఇంకోపక్క లోటుబడ్జెట్, ఆర్థికభారం ఇవన్నీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కారణంగా చెప్పవచ్చు. పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాకపోయినా, మెల్లిగా నత్తనడకన పనులు నడుస్తూ ఉండవచ్చు.

ప్రాజక్టు పనులు సరే కనీసం నిర్వాసితుల మాట ఏమిటి. వాళ్ళను ఖాళీ అయితే చేయించారు, ఇంతవరకు వారికి పరిహారం ఇవ్వడం కానీ, ఇతర సౌకర్యాలు కల్పించడం కానీ పూర్తికాలేదు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు వీళ్ళగతి కూడా అంతేనా అనేది కూడా ఇప్పటి ప్రశ్న. దేశంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో, అందులో బలిపశువులుగా మిగిలిపోయిన నిర్వాసితులు ఎందరో.. వాళ్ళను ఒక్కసారి పరికిస్తే, బహుశా ఇంకా వాళ్లకు సరిగ్గా ఏమీ అంది ఉండకపోవచ్చు. ఇప్పటి పరిస్థితిలో ఇవన్నీ ఆలోచించడం అంత మంచిది కాదేమో, కరోనా కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఆర్థికనష్టం బాగా పెరిగిపోయింది. అందుకే అతిప్రధానమైన వాటిపై తప్ప ఖర్చులు పెట్టకపోవడం మంచిదే. మరి నిర్వాసితులు పౌరులే, వాళ్లకు కనీస అవసరాలు అందించడం కూడా అత్యవసరంలోకే వస్తుంది అనుకుంటాను, చూడండి కాస్త!

మరింత సమాచారం తెలుసుకోండి: