టీడీపీ అధినేత జనానికి వరుసగా హామీలు ఇచ్చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారిన ఓటీఎస్ పధకానికి డబ్బులు కట్టొద్దని తాజాగా చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కోసం కేవలం పదివేల రూపాయలు కట్టాలని చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం కొద్ది రోజులు ఆగండి, మన ప్రభుత్వంలో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తానని అంటున్నారు. ఓటీఎస్ పధకం పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, ప్రజలెవరూ డబ్బు కట్టవద్దని చంద్రబాబు చెబుతున్నారు. సంపూర్ణ గృహ హక్కు పధకం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో దాదాపు సగం కూడా టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ వంటి హామీలు సగం సగమే అమలయ్యాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఓటీఎస్ కు డబ్బులు కట్టొద్దు మేం అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామంటున్నారు చంద్రబాబు. దీన్ని ప్రజలు నమ్ముతారా..? నమ్మినా ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా ఉంటారా అనేదే అసలు సమస్య. ఇప్పటికే గ్రామ స్థాయిలో అధికారులు ఇంటింటికీ వెళ్లి, డబ్బు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం డబ్బు కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఓటీఎస్ పధకం స్వచ్ఛందమని వైసీపీ నేతలు చెబుతున్నప్పటికే కింది స్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. బలవంతపు వసూళ్ల మాదిరిగానే వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలున్నాయి. ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్ ఆఫీసులో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా, ఇప్పుడిలా గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరినీ బలవంతం చేయడం లేదని కచ్చితంగా చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ ప్రాజెక్ట్ ల కోసం భూములు ఇచ్చి.. పునరావాసంలో భాగంగా ఇళ్ళు తీసుకున్న వారు కూడా ఓటీఎస్ పధకానికి డబ్బులు కట్టాల్సి రావడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఓటీఎస్ పధకానికి డబ్బులు కట్టొద్దనే హామీతో చంద్రబాబు ఏం సాధించబోతున్నారనేది పక్కనపెడితే.. చంద్రబాబు హామీని అసలు జనం నమ్ముతారా అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ బాబు హామీని నమ్మి ఓటీఎస్ కి దూరంగా ఉన్నవాళ్లంతా 2024 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: