ఏపీలో 2024 ఎన్నికల్లో జనసేన - తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయ‌న్న ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడించాలంటే మనం కలిసి పని చేయాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ , ఎంపీటీసీ, జడ్పిటిసి... మున్సిపల్ ఎన్నికల్లో అధిష్టానం తో సంబంధం లేకుండా జనసేన - టిడిపి పొత్తు పెట్టుకుని కొన్ని చోట్ల పోటీ చేశాయి.

ఇలాంటి చోట్ల రెండు పార్టీలకు మేలు జరిగింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని కడియం మండలం లో జనసేన మంచి ఫలితాలు సాధించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు వార్డులో పోటీచేసిన జనసేన మూడు చోట్ల విజయం సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కు సంబంధించి జనసేన తో రెండు విడతలుగా ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.

ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతల మధ్య జరిగిన ఈ చర్చల్లో జనసేన 6 లోక్‌స‌భ సీట్లతో పాటు 40 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే జనసేన కోరినట్టు అన్ని సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోలేదని సమాచారం. తెలుగుదేశం నాలుగు ఎంపీ సీట్లతో పాటు 20 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు మాత్రమే సుముఖంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి.

అయితే మరి ఈ సీట్ల లెక్కలు ఎక్కడికి తెగుతాయి ? అన్న దాన్ని బట్టే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తు ఉంటుందా ఉండదా ? అన్నది ఆధారపడి ఉంటుంది. మ‌రి రెండు వైపుల నుంచి వ‌చ్చే డిమాండ్ల లో ఎవ‌రో ఒక‌రు వెన‌క్కు త‌గ్గ‌క పోతే త‌ప్పా ఈ పొత్తు కుదిరేలా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: