మూడు సీట్లు ఉన్న పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించాల‌ని ఆరాట‌ప‌డుతోంది. తెలంగాణ‌లో బీజేపీ కి ఉన్న‌ది కేవ‌లం మూడు అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలు కానీ, రాబోయే ఎన్నిక‌ల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామ‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌క‌టిస్తున్నారు. గెలుపు మాట ప‌క్క‌న పెడితే అస‌లు అంత‌మంది అభ్య‌ర్థులు ఆ పార్టీకి ఉన్నారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. గ‌డిచిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 119 స్థానాల్లో బీజేపీ గెలిచింది ఒక్క‌టే.. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో దుబ్బాక, హుజురాబాద్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కాషాయ పార్టీ.


 ప్ర‌స్తుతం బీజేపీకి ముచ్చ‌ట‌గా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విజ‌యాల‌తో త‌మది వాపు కాదు బ‌లం అంటూ ప్ర‌క‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది తమ పార్టీనే అని జోష్యం చెబుతున్నారు. అయితే, బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ఏం ప్లాన్ వేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో అలాంటి ప‌రిస్థితి ఉందా అనే చ‌ర్చ ఆ పార్టీలో కొన‌సాగుతోంది. దీంతో పాటు క్షేత్ర స్థాయిలో బ‌ల‌మైన అభ్యర్థులు లేరు కూడా. పాత నాయ‌కులు, కొత్త‌గా వ‌చ్చిన నేత‌లంద‌రిని క‌లిపితే దాదాపు 40 నియోజ‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు దొరికి అవ‌కాశం ఉంది.


  మ‌రి మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తి ఏంట‌ని పార్టీలో టాక్ వినిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికి అంతంతేగా ఉంద‌ని తెలుస్తోంది. దీంతో ఇప్ప‌టి నుంచే ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ప్రొజెక్ట్ చేయ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్టమేన‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం తీసుకువ‌చ్చేందుకు బీజేపీ అధినాయ‌కత్వం 70 సీట్లు వ‌స్తాయ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీలో అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పినా రాబోయే రోజుల్లో అది బెడిసికొట్టే అవ‌కాశాలు ఉన్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కానీ, టీఆర్ఎస్ పై వ్య‌తిరేక‌త ఉంద‌ని అది బీజేపీకి క‌లిసి వస్తుంద‌ని కాషాయ ద‌ళం న‌మ్మ‌కం పెట్టుకుంది. మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

BJP