తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ... ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయింది. దుబ్బాక అసెంబ్లీ ఉన్న ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన జోరులోనే... గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. అక్కడ కూడా దాదాపు మేయర్ స్థానాన్ని గెలుచుకున్నంత పని చేసింది కమలం పార్టీ. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో మరింత బలపడింది బీజేపీ. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పుకోవడంతో ఇక ఆ పార్టీ జోరు మరింత పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. అధికార టీఆర్ఎస్ పార్టీపై యుద్ధమే చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని రాజకీయ విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో యాసంగి ధాన్యం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారాయి. ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో గులాబీ పార్టీ నేతలు యుద్ధమే చేస్తున్నారు.

ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ సర్కార్ స్పీడు పెంచేసింది. మోదీ సర్కార్‌పై దాడికి శ్రీకారం చుట్టేసింది గులాబీ పార్టీ. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ కూడా ఢిల్లీలో ఆందోళనలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను గులాబీ పార్టీ బహిష్కరించింది. అలాగే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు తెలియజేస్తామని ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్రం యుద్ధం చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నాటు చెప్పారు ఎంపీలు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఈ నెల 23వ తేదీ వరకు కూడా పార్లమెంట్ బయట నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ పార్టీకి మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు. లోక్ సభలో 8 మంది, రాజ్యసభలో ఏడుగురు ఉన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీ సర్కార్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: