ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌న్‌టైమ్ సెటిల్‌మెంట్ పై ర‌గ‌డ కొనసాగుతూనే ఉన్నది. వ‌న్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌తో ఒకే మొత్తంలో రుణ‌బ‌కాయిల‌ను చెల్లించి జ‌గ‌న్ అన్న సంపూర్ణ గృహ‌ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారులు ఇండ్ల‌పై పూర్తి హ‌క్కులు పొందాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ సూచిస్తుంటే.. ఓటీఎస్ పేరుతో దోపిడీకి తెర తీసార‌ని, పేద ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు అని ప్ర‌తిప‌క్ష పార్టీలు సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో  ప్ర‌భుత్వం తీసుకున్న ఓటీఎస్ నిర్ణ‌యంపై తీవ్ర గంద‌ర‌గోళంలో ఉన్నారు ప్ర‌జ‌లు. గ‌త ప్ర‌భుత్వాలు ఇచ్చిన ఇంటి రుణాల‌ను, ఇప్పుడు ఎందుకు చెల్లించాల‌ని ప్ర‌శ్నిస్తున్న వారు కొంద‌రు అయితే.. ఇప్పుడు అయితే ఇది ఆఫ‌ర్‌, ఆ త‌రువాత మొత్తం చెల్లించాల్సిందే అంటూ.. ప‌లువురు చ‌ర్చించ‌డం మొద‌లు పెట్టారు.

ఎవరూ ఓటిఎస్ చెల్లించవద్దని ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చిన త‌రువాత‌ ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని ప్రకటనలు చేస్తోంది.  టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇండ్ల‌కు, ఇప్పటి ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు చెల్లించాలో చెప్పాలని నిలదీస్తున్నారు టీడీపీ నాయ‌కులు.  ఇదే సమయంలో జగన్ ప్ర‌భుత్వం ఓటిఎస్ పై బీజేపీనేత లంకా దినకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వన్ ఛాన్స్ అంటూ వచ్చి.. కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైం సెటిల్‌మెంట్‌ అంటూ వన్ టైం సీఎంగా జగన్ మిగిలిపోబోతున్నారని వ్యాఖ్యానించారు  లంకా దినకర్. ప్రతిపక్షంలో పేదల ఇండ్ల‌పై రుణాలు  రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన త‌రువాత‌ ఆ హామీని రద్దు చేసారని లంకా దినకర్ ఎద్దేవా చేసారు.

అదేవిధంగా పేదల గృహాలపైన ఓటిఎస్ వారి ఇష్టపూర్వకమే అని చెప్పేవారు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లను ఎందుకు చేస్తున్నారో చెప్పాల‌ని  ప్రశ్నించారు లంకా దినకర్. పథకాల రద్దు బెదిరింపుల మాటేమిటి అని ఆయ‌న నిలదీసారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెండ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ ప్ర‌భుత్వ‌ పాలన తీరు ఉందని.. ఓటిఎస్ విషయంలో లంకా దినకర్ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆస్తి హక్కు పత్రాల పై హక్కుదారుల ఫోటోలు ఉండాలని,   జగన్ ఫోటో కూడా ఉంచటం ఏమిటీ అంటూ లంకా దినకర్ ప్రశ్నించారు.

ఆస్తి హక్కు పత్రాలపై జగన్ ఫోటోలు ఉండటం ప‌ట్ల  దినకర్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  రాష్ట్రంలో అందరి ఆస్తులకు ఆయనే హక్కుదారు కావాలనుకుంటున్నారా అని.. లంకా దినకర్ జగన్ పై సెటైర్లు వేసారు. జగన్ కోరిన విధంగా రాష్ట్ర ప్రజలు జగన్ పాలనకి వన్ టైం సెటిల్ మెంట్  ఇవ్వబోతున్నారని, జగన్ వన్ టైం సీఎంగా మిగిలిపోబోతున్నారని  వ్యాఖ్యానించారు లంకా దినకర్. రాష్ట్రంలో సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ పై  బీజేపీ నేత  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిపాలనలో అభివృద్ధి కన్నా బిజినెస్ ఎక్కువయ్యిందని,  గతంలోనే పేర్కొన్న ఆయన సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని  ఆరోపించారు లంకా దినకర్. పేద, మధ్య తరగతి వర్గాల పాత గృహ లబ్ధిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జ‌గ‌న్‌ స్పెషలిస్ట్ అని  పేర్కొన్నారు. కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా, కొత్త ఇల్లు సరిగ్గా కట్టకుండా వైసీపీ ప్రభుత్వం పేదల నుంచి వసూలు చేయ‌డం ఆరంభించింద‌ని లంకా దినకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఎప్పుడో పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల‌పై ఓటీఎస్ పిడుగు నెత్తిన వేయడం జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు లంకా దినకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: