భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. అదే అధిక జనాభా. ఈ ఒక్క కారణం చూపించి, దోచుకోవాల్సింది అంతా చక్కగా దాచేసుకుంటున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయమంటే జనాభాను సాకుగా చూపించే ఈ నేతలంతా మళ్ళీ అదే తరహాలో పేదలు కాదు, అందరు బాగా ఉన్నోళ్లే. అంటే ఉన్నదంతా వాళ్ళు బొక్కేయడానికే సరిపోతుంది తప్ప ప్రజలకు అందించడానికి మాత్రం చేతులు రావు. పేదలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు తప్ప, తగ్గిన పాపాన పోలేదు. అదే తరహాలో రాజకీయాలలోకి వచ్చి, దండుకున్న నేతలు తప్ప ఎవరు పేదలు అయిపోయిన చరిత్ర బహుశా చాలా తక్కువ. ప్రజాసేవలో అంకితభావంతో పని చేస్తూ, తనకు ఉన్నది కూడా ఆ సేవలో వాడేస్తూ, పేదవాళ్ళు అయిన నేతలు ఇన్నేళ్ళలో కూడా వేళ్ళమీద లెక్కపెట్టే అంతమంది మాత్రమే ఉండొచ్చు, అది రాజకీయాల పరిస్థితి.

గేదె గడ్డిపై కూడా స్కాం అంటే అది మనదేశంలోనే జరిగి ఉండొచ్చు, అదొక ప్రత్యేకతగా చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడక తప్పదు మరి. మరో అడుగు ముందుకు వేసి, స్మశానాలను కూడా కబ్జా చేసి, వాటిపై కూడా వ్యాపారాలు చేసుకునే గొప్ప రాజకీయ సంస్కృతి మన వాళ్ళకే చెల్లింది. దాదాపుగా ఈ కబ్జా విషయం గురించి ఆలోచిస్తుంటే, చైనా లో ఒక్క జిన్ మాత్రమే ఉన్నాడు, భారత్ లో దాదాపు ప్రతి నేత ఒక జిన్ లాగానే కనిపించిందంతా తనదే అంటూ బొక్కేస్తున్నాడు. అందుకే మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశమైనప్పటికీ అది అభివృద్ధి చెందింది, మనం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాం.

దేనికైనా మన నేతలకు ఉన్న అన్ని రికార్డులు ఎవరికీ ఉండబోవు కాబోలు. నేర చరిత్ర కాడినుండి, స్కాం వరకు, కబ్జాల నుండి కొట్లాటల వరకు అన్నిటిలో మన వాళ్లదే పై చేయి. ఇందుకు గర్వపడదామంటే, దీనిని గుర్తించి అవార్డులు ఇచ్చే వారు ప్రపంచంలో లేకపోతిరి. అలాంటి అవార్డులు ఇస్తే, చైనా ఒలింపిక్స్ లో సాధించిన దానికంటే ఎక్కువగా మనకు పతకాలు వచ్చేస్తాయి. ఏదీ వదలకుండా తినాలనేది వాళ్ళను చూసే నేర్చుకోవాలి. అనాధ ఆశ్రమం, స్మశానం, బలహీనుడి స్థలాలు, దేవాదాయ భూములు, చెరువులు కూడా ఇలా ఏదీ కూడా వదలకుండా వాడేసుకోవడం మనవాళ్లకంటే బాగా ఎవరికీ తెలియదు. మన నేతలకు ఇలాంటివి తెలుసుకానీ, ప్రజా సేవ మాత్రమే తెలియదు. బహుశా రాజకీయాలు అంటే ప్రజాసేవ అనే అర్ధం మార్చి, దానికి ఇంకో అర్ధం చెప్పేస్తున్నారు. ఇలా వాళ్ళు పరోక్షంగా చెపుతున్నప్పటికీ, ప్రజలకు అర్ధం కావడం లేదు. గొర్రెలు కూడా దారిలో గొయ్యి వస్తే పక్కకు పోతున్నాయి. ఈ రాజకీయాలు, ప్రజలు మారేదెప్పుడో!

మరింత సమాచారం తెలుసుకోండి: