మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పేరుకే 40 అసెంబ్లీ స్థానాలున్నా కూడా... గత ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పాటు పరిపాలన సజావుగా సాగించారు కూడా. అయితే అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో గోవాలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మనోహర్ పారికర్ వంటి కీలక నేత మరణంతో కమలం పార్టీ తొలిసారి కేంద్ర పెద్దలపై ఆధారపడింది. గోవాలో తిరిగి అధికారం దక్కించుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు గోవాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక దృష్టి సారించారు గోవా ఎన్నికలపైన. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోవాలో కమలం వికసించాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు కూడా.

అటు గోవాలో అధికారం దక్కించుకునేందు కాంగ్రెస్ పార్టీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గోవాను మరింత అందంగా తీర్చిదిద్దుతామని ఇప్పటికే హామీల వర్షం కురిపిస్తున్నాయి కూడా. గోవా అసెంబ్లీకి మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించారు. పట్టుమని నాలుగు నెలలు కూడా సమయం లేదు. ఈ సమయంలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు మమతా బెనర్జీ. ఇప్పటికే బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ... ఎంజీపీతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలో దీదీ రెండు సార్లు గోవాలో పర్యటించారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపులతో పాటు.... ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కూడా రెండు పార్టీల మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని.... ఒక అవగాహన ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: