కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక చిత్రమైన సమస్య చిలికి చిలికి గాలి వానగా  మారుతోంది. అర్బన్ శివారు ప్రాంత అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను నిర్మించేందుకు సిద్దమైంది. అయితే కొన్ని అపోహలు, సందేహాల నడుమ స్థానిక ప్రజలు ఆ నిర్మాణం తమకు వద్దు అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధానంగా అక్కడి ప్రజల వాదన బట్టి చూస్తే ఆసుపత్రి నిర్మాణంపై దుష్ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఆసుపత్రి ప్రతిపాదన జరిగి సుమారు రెండు ఏళ్ళు పైన గడుస్తోంది. అయితే ప్రతిపాదన తెర మీదకు వచ్చిన సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి పడుతుంది అని ప్రచారం ఊపందుకుంది.. దీంతో అక్కడి వారిలో అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తారని... వెడల్పు చేసే క్రమంలో కట్టిన ఇళ్లు కూలగొడతారని ప్రచారం జరిగింది.

అంతేకాకుండా పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఫలితంగా చుట్టూ ప్రక్కల వారు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అదనపు ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆసుపత్రి నిర్మాణంపై స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. నిర్మాణం చేపట్ట వద్దంటూ స్థానికులు నిరసన గళం వినిపించారు. ఇక ఇదే వివాదంపై అధికారులు మాట్లాడుతూ కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 30 సెంట్లు కామన్ సైట్ లో ఒక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , అలానే మిగతా 20 సెంట్ల భూమిలో ఒక కమ్యూనిటీ హాల్ ఒక అంగన్వాడీ కేంద్రం నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. స్థానికుల వాదనలోనూ అర్థం లేకపోలేదు. ఆ ప్రాంతంలో కనీసం మౌలిక వసతుల కల్పన డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రి వ్యర్ధాలు తమ ఇళ్ళ మీదకు వస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా తాగునీటి కుళాయిలు సైతం మురుగు లోనే ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజలు ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇచ్చి తద్వారా డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేస్తే ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది అనేది స్పష్టం అవుతోంది. కొనసాగుతున్న ప్రజావ్యతిరేకత నడుమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: