సేవ్ అమరావతి పేరుతో న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి రైతుల పాదయాత్ర తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో యాత్ర పూర్తి చేసుకున్న రైతుల పాదయాత్ర... ఇప్పుడు చివరగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు మినహా... ఇప్పటి వరకు రైతుల పాదయాత్ర సజావుగానే సాగింది. ముందుగా ప్రకాశం జిల్లాలో రైతుల పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. నోటీసులు ఇచ్చారు. చివరికి యాత్రలో పాల్గొనేందుకు వస్తున్న వారిపై లాఠీఛార్జ్ కూడా జరిగింది. అయినా రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక నెల్లూరు జిల్లాలో వర్షం ఇబ్బంది పెట్టినా కూడా యాత్ర ఆగలేదు. చివరగా సర్వేపల్లి నియోజకవర్గంలో యాత్ర చేస్తున్న తమపై స్థానిక సీఐ దురుసుగా ప్రవర్తించారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమకు కనీసం ఉండేందుకు కూడా వసతి కూడా చేశారంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిపై విమర్శలు చేశారు కూడా.

ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నీ దాటుకుని... చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది రైతుల మహా పాదయాత్ర. పేరుకే తెలుగుదేశం పార్టీ అధినేత సొంత జిల్లా అయినప్పటికీ... అక్కడ టీడీపీకి అంతగా  పట్టు లేదు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేవలం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాత్రమే గెలిచారు. మిగిలిన అన్ని స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా టీడీపీ ఓడింది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలులో హైకోర్టు పెట్టాలని నిర్ణయించింది జగన్ సర్కార్. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సజావుగాసాగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. ఈ సభకు ప్రభుత్వ అనుమతి లభిస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ప్రస్తుతం కోస్తా వర్సెస్ సీమ అన్నట్లుగా పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: