ఓ వైపు ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అటు తెలంగాణ ప్రభుత్వం అయితే మాస్క్ పెట్టుకోకపోయినా సరే... ఏకంగా వెయ్యి రూపాయలు జరిమానా వేస్తామని ప్రకటించింది కూడా. మరోవైపు దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా  వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది. ఇక ఓమిక్రాన్ వేరియంట్ భయంతో వ్యాక్సిన్లకు మరింత డిమాండ్ పెరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్లు కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వినియోగించలేదు అన్ని రాష్ట్రాలు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వ్యాక్సిన్ల కొనుగోలును తగ్గించేసింది. కేంద్రం నుంచి ఎలాంటి కొత్త ఆర్డర్ రాకపోవడంతో... కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని సగానికి తగ్గించాలని సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ నిర్ణయించింది.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి కొత్త ఆర్డర్ రాలేదని... అందుకే తమ ఉత్పత్తిని సగానికి తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా వెల్లడించారు. కొత్త ఆర్డర్ వచ్చిన వెంటనే మళ్లీ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. కేంద్రం కోరిన వెంటనే ఎలాంటి కొరత లేకుండా వ్యాక్సిన్లు అందిస్తామన్నారు. అయితే కేంద్రం సీరం సంస్థకు ఆర్డర్ ఇవ్వకపోవడం వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. రష్యా ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ దిగుమతికి భారత్ అంగీకరించింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు రష్యా ప్లాన్ చేస్తోంది. దీంతో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం విముఖత చూపుతోంది. దీంతో ఆర్డర్లు ఇవ్వడం లేదని సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు కూడా వృథా అవుతున్నాయని కూడా సీరం సంస్థ భయపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: