కేంద్రం ఏమో రాష్ట్రంపై స‌వ‌తి త‌ల్లి ప్రేమ క‌న‌బ‌రుస్తోంది అన్న విమ‌ర్శ త‌రుచూ వినిపిస్తోంది. విని విని విసిగిపోయాక ఇక కేంద్రం నుంచి ఏం కోరుకోవాలో అర్థం కావ‌డం లేదు. ప్రేమ సానుభూతి కాదు కానీ ఇంకొన్ని నిధులు మ‌న రైతుకు విదిల్చి ఆ విధంగా న‌ష్ట‌పోయిన కుటుంబాల‌కు పెద్ద‌న్న పాత్ర‌లో అండ‌గా ఉంటే మేలు. కానీ కేంద్రం ఆ ప‌ని ఇప్ప‌టికిప్పుడు చేస్తుంద‌ని అనుకోను. కానీ  మోడీ స‌ర్కారు మాట‌లు మాత్రం మ‌ళ్లీ మ‌రో మ‌న్ కీ బాత్ లో వినేందుకు ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు సిద్ధంగా లేరు అన్న‌ది ఓ చేదు నిజం.


6.10ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి నేల‌కొరిగింది. పంట చేతికి వ‌చ్చే వేళ మ‌ళ్లీ వేద‌నే మిగిలింది రైతుకు. తీవ్ర తుఫానులు కార‌ణంగా వ‌స్తున్న ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌లేక, ప్ర‌భుత్వం సాయం అందినా అంతంత మాత్రం కావ‌డంతో  వేళ కాని వేళ వాన‌..అకాల వాన.. కార‌ణం ఉన్నా లేకున్నా వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం మాత్రం న‌మోదు అయింది. అవుతోంది. పంట పోయిన రైతు గుండెల‌విసేలా ఏడుస్తున్నాడు. ప్ర‌భుత్వానికి విన్న‌విస్తూ త‌మ‌ను ఆదుకుంటే మ‌రికొన్ని రోజులు ఇదే సాగు ప‌నిని న‌మ్ముకోగ‌ల‌మ‌ని లేదంటే తాము కాడి వ‌దిలేయాల్సిందేన‌ని కూడా చెబుతూ ఏడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంది ఉన్న వివ‌రాలు మేర‌కు 13.24ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట పోయింద‌ని అధికారికంగా తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు కేంద్రం ఓ వెయ్యి కోట్లు త‌క్ష‌ణ సాయం కింద విడుద‌ల చేస్తే మేలు. కానీ కేంద్రం ఆ ప‌ని చేయ‌దు. తుఫాను వేళ  ఉత్తుత్తి ప‌ల‌క‌రింపుల‌కే స‌మ‌యం వెచ్చిస్తోంది అన్న ఆరోప‌ణ‌లు మాత్రం ఎదుర్కొంటోంది.


తాజా తుఫాను న‌ష్టం 3300 కోట్ల రూపాయ‌లు అని తేలింది. దీనిని ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం వెల్ల‌డించారు. ఇక పంట న‌ష్టం విలువ ఇంకా ఎక్కువ ఉంటుంద‌నే భావ‌న ఒక‌టి వినిపిస్తుంది. ముఖ్యంగా తుఫాను కార‌ణంగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలూ అత‌లాకుత‌లం అయ్యాయి. తుఫాను విల‌య ప్ర‌భావంతో క‌డప‌, అనంత‌పురం, తూర్పుగోదావ‌రి, గుంటూరు జిల్లాల‌లో చాలా అంటే చాలా న‌ష్ట‌పోయాయి. వీటిని ఆదుకునే ప్రక్రియ‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. కంటితుడుపు ప‌రామ‌ర్శ‌లు వ‌ద్దు గాక వ‌ద్దు. వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు అని బాధితులు త‌మ గోడు వినిపిస్తూ ఉన్నారు. గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్ప‌టికే తుఫాను కార‌ణంగా వ‌రి, వేరుశ‌న‌గ‌, మినుము, మిర్చి పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని ప్ర‌ధాన మీడియా క‌థ‌నాలు స‌వివ‌ర‌ణాత్మ‌కంగా  వెల్ల‌డిస్తున్న నిజం. ఇంత‌టి బాధాక‌ర స‌మ‌యంలో రాజ‌కీయాల‌కు తావివ్వ‌క ప్ర‌భుత్వం విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించి ముందుగా అధికారుల‌తో పంట న‌ష్టం అంచ‌నాల‌ను రూపొందింప‌జేయాల‌ని కోరుతున్నారు సంబంధిత రైతులు. చిత్తూరు జిల్లాలో ఎకరంన్న‌ర పంట‌కు అయిన ఖ‌ర్చు 35 వేలు.. అవ‌న్నీ అప్పుల‌తో చేసిన సాగే! పంట మొత్తం పోయింది. ఇప్పుడా రైతును ఆదుకునేదెవ్వ‌రు?


మరింత సమాచారం తెలుసుకోండి: