ఏపీలో వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో రేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. ఓటీఎస్ కి డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎక్కడికక్కడ హౌసింగ్ కార్పొరేషన్ కి బకాయిలు ఉన్న లబ్ధిదారులు హడలిపోతున్నారు. ఓవైపు ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నా కూడా అక్కడక్కడ ఈ ఆందోళనలకు సమాధానం కరువవుతోంది. మరోవైపు అధికారులకు మాత్రం టార్గెట్లు పెడుతూ వస్తున్నారు. దీంతో స్థానికంగా అధికారులు కింది స్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఆదేశాలు పేపర్ రూపంలో బయటకు రావడంతో సిబ్బందిని సస్పెండ్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎంపీడీవోల మాటలు ఆడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

మొత్తమ్మీద ఓటీఎస్ వ్యవహారం మంత్రులకు తలనొప్పిగా మారింది. ఎక్కడ ఎవరు ఏ పర్యటనకు వెళ్లినా కూడా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓటీఎస్ స్వచ్ఛందమా..? కాదా..? ఓటీఎస్ కి అర్హులైనవారు డబ్బులు కట్టకపోతే పథకాలు నిలిపివేస్తారట నిజమేనా? అని అడుగుతున్నారు. దీంతో మంత్రులు పదే పదే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.

తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఓటీఎస్ లబ్ధిదారులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, అది పూర్తిగా స్వచ్ఛందం అని మంత్రి అవంతి స్పష్టం చేశారు. అంతే కాదు, ప్రతిపక్షాలపై ఆయన దుమ్మెత్తిపోశారు. సంక్షేమ పథకాలపై అక్కసుతో ప్రతిపక్షం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. పథకాలు ఆపే ప్రసక్తే లేదని, ఓటీఎస్ పూర్తిగా లబ్ధిదారుల అనుమతితో జరిగే ప్రక్రియ అని చెప్పారాయన.

మరోవైపు అధికారులు మాత్రం ఇలా స్వచ్ఛందం అనే ప్రకటన జనాల్లోకి బాగా వెళ్తే.. డబ్బులు కట్టేవారు ఎవరూ ఉండరని, ఎంత అవగాహన కల్పించినా.. ఇప్పటికిప్పుడు 10వేల రూపాయలు తీసుకొచ్చి ఓటీఎస్ కి జమచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు. దీంతో చాలా చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ సానుభూతిపరులు మాత్రమే ఓటీఎస్ కోసం ముందుకొస్తున్నారు. పేదలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఓటీఎస్ కి మొగ్గు చూపడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: