అనంతపురం అంటే టీడీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత ఎన్నికల్లోనే జిల్లాలో జగన్ గాలిలో టీడీపీ చిత్తుగా ఓడింది..ఇక ఆ ఓటమి నుంచి పార్టీ చాలావరకు బయటపడిందనే చెప్పాలి. ఈ రెండున్నర ఏళ్లలో పార్టీ చాలావరకు పుంజుకుంది. దాదాపు సగం నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టీడీపీకి అడ్వాంటేజ్‌గా ఉంది. ఇలాంటి సమయంలో ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉంది. కానీ నేతల మధ్య సమన్వయం లేక ఇంకా పార్టీని కష్టాల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రజలు టీడీపీ పట్ల పాజిటివ్‌గానే ఉన్నారు...కానీ టీడీపీ నేతలే సరిగ్గా లేరు. దానికి ఉదాహరణగా పలు అంశాలు ఉన్నాయి. ఎక్కడకక్కడ నేతల మధ్య ఐకమత్యం కనిపించడం లేదు. జిల్లాలో అనంత పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులుకు....జేసీ ఫ్యామిలీకి పెద్దగా పడటం లేదు. అటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీకి, జేసీ ఫ్యామిలీ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇటు శింగనమల ఇంచార్జ్‌ బండారు శ్రావణి....కాల్వపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అటు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న బి‌కే పార్థసారథి...మిగిలిన నేతలని సరిగ్గా సమన్వయం చేసుకుని ముందుకెళ్లడంలో విఫలమవుతున్నారు. ఈ విషయంపై చంద్రబాబు....అనంత నేతలపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల పెనుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది...దీనిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలు పెనుకొండ టీడీపీకి కంచుకోట. అలాంటిది అక్కడ టీడీపీ కేవలం 2 వార్డులు మాత్రమే గెలుచుకోవడంపై బాబు సీరియస్ అయ్యారు.

పైగా జిల్లా నేతలంతా కట్టగట్టుకుని మరీ పెనుకొండలో ప్రచారం చేశారు. కానీ ఫలితం మాత్రం రాలేదు. అందుకే బాబు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెనుకొండలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఐక్యత లేదని, పార్థసారథి సమన్వయంతో ముందుకు వెళ్లడంలేదని క్లాస్ పీకినట్లు సమాచారం.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇంత మంది ప్రచారానికెళ్లినా రెండు సీట్లతో తిరిగొచ్చారని బాబు ఫైర్ అయినట్లు తెలిసింది. అలాగే భవిష్యత్‌లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, లేదంటే నాయకులని పక్కనబెట్టడానికి కూడా ఆలోచించనని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అనంత నేతలకు బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని అర్ధమవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: