ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మ‌రొకసారి భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. చిత్తూరు జిల్లా  రామ‌కుప్పం మండ‌లంలో అర్థరాత్రి భూమి ఒక్క‌సారిగా కంపిస్తున్న‌ది. ముఖ్యంగా మండ‌ల ప‌రిధిలోని పెద్దగరికపల్లి, గొరివిమాకుల పల్లి, కృష్ణ నగర్‌, యనాది కాలనీ, గెరిగి పల్లె, గడ్డురు ప్రాంతాల‌లో భూప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. భారీ శబ్దాలతో భూప్రకంపనలు రావ‌డంతో.. భూమి లోపల పొరల నుంచి విపరీతమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి.  భూమి కంపిస్తుండటంతో అక్కడి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గుర‌వుతూ ఆందోళ‌న  చెందుతున్నారు.

భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు ఇండ్లు వదిలి పంట పొలాల్లోకి పరుగులు తీసారు. భూమి లోపలి నుంచి వస్తున్న భారీ శబ్దాలతో పలువురి ఇండ్ల గోడలకు చీలికలు కూడా వచ్చాయి. అదేవిదంగా ఇండ్ల‌లో ఉన్న వస్తువులు కింద పడ్డాయి. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా భూకంపం రావడంతో ప్రజలు రాత్రి మొత్తం ఇంటి బయటే ఉన్నారు.  గ‌త కొద్ది రోజుల కింద‌ట ఇదే మాదిరిగా పలుమార్లు భూమి నుండి వింత శబ్దాలు వినిపించాయి. అయితే తరచుగా వస్తున్న భూ ప్రకంపనలపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహమ‌వుతున్నారు.  భూమి పొరల‌లో శ‌బ్ధాలు కొనసాగుతుడడంతో జనాలు హడలెత్తి పోతున్నారు.

  కొద్ది రోజుల కిందటే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో భూమి  నుంచి వింత శబ్దాలు వినబడడంతో  స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు భయంతో అక్కడి నుండి పరుగులు తీసి.. ఏమి జరుగుతుందో తెలియక రాత్రంతా  ఇండ్ల బయటే కూర్చొని జాగారం చేసారు.  చిత్తూరు జిల్లాలో నిత్యం ఇలా భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకుంటుండ‌డంతో భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అధికారులు త‌మ గోడును ప‌ట్టించుకొని భూమి ఎందుకు కంపిస్తుందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇండ్ల వ‌ద్ద ఉన్న స‌మ‌యంలోనే ఇలా భూ ప్ర‌కంప‌న‌లు రావ‌డం.. మ‌ళ్లీ పొలాల వ‌ద్ద రాక‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు  ప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ప్ప‌టి నుంచి  పొలాల వ‌ద్దే ఉంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: