ఆంధ్రప్రదేశ్లో రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పోసిన రోడ్ల‌కే ఇప్పటికీ బిల్లులు రాని దారుణమైన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో రహదారులు పోసేందుకు ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి. పోసిన‌ రహదారుల‌కు బిల్లులు ఎప్పుడు వస్తాయి కూడా తెలియని దుస్థితి ఉండడంతో కాంట్రాక్టర్లు ఆంధ్రాలో పనులు చేసేందుకు భయపడుతున్నారు. విచిత్రమేంటంటే ఆంధ్రా కు చెందిన పలువురు కాంట్రాక్టర్లు పక్కనే ఉన్న బెంగళూరు లేదా తమిళనాడు లేదా తెలంగాణలో పనులు చేసుకుంటున్నారు... తప్ప ఆంధ్రాలో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.

ఇదిలా ఉంటే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు తన నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉండడంతో తన సొంత డబ్బులతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఆయన నియోజకవర్గంలోని రావులపాలెం కోనసీమకు ముఖద్వారంగా ఉంటుంది. కోన‌సీమ వెళ్లేవాళ్లు అందరూ రావులపాలెం నుంచి వెళతారు. రావులపాలెం లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

పైగా వచ్చేది సంక్రాంతి సంక్రాంతికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోనసీమలో కోడిపందేలకు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. దీంతో ఆయన తన సొంత డబ్బులు వెచ్చించి మరి అక్కడ రహదారుల మరమ్మతులు చేపట్టారు. అయితే ఈ పనులు తాత్కాలికమా ? శాశ్వతమా ? అన్నది పక్కన పెడితే... జగ్గి రెడ్డి చేసిన పనికి ఇప్పుడు ఆయన పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే దేవుడు రా బాబు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలా కొంత వరకు వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌హ‌దారుల‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలా చేయాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడంతో తూర్పు గోదావ‌రి జిల్లా లోని మిగిలిన ఎమ్మెల్యే లు అంతా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: