టీడీపీ అయినా వైసీపీ అయినా
ఎవ్వరయినా ప్రశ్నలు అడిగే వేళ
కాస్తయినా హుందాతనం
హేతువుకు తూగే విధానం వీటికే
ప్రాధాన్యం ఇవ్వాలి
పండ్ల రసాల వ్యాపారం చేసుకుంటున్నాం కనుక
ఎగుమతి సుంకాలు తగ్గించండి అని ఒకరు
రాజకీయం చేసుకుంటున్నాం కనుక
మా నాయకుడి పేరు ఐఐటీలకు పెట్టండి అని ఒకరు
అడిగితే తోటి ఎంపీలు నవ్వుకుంటారు సర్..
కాస్తయినా మీరు బుర్ర ఉపయోగించకపోతే ఆ చదువుకు ఏం విలువ?


ప్రశ్నకు ఓ లక్షణం ఉంటుంది. ఉండాలి కూడా! గౌరవ పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు ఓ స్థాయి ఉండాలి. ఉంటేనే రాణింపు ..లేదంటే అవి ఎందుకూ పనికిరానివిగానే మిగిలిపోతాయి. పోవడమే కాదు మన పరువు కూడా తీసిపారేస్తాయి. కనుక గౌరవ పార్లమెంట్ సభ్యులు మీసాలు మెలేయకుండా, గట్టిగట్టిగా అరిచి గోల చేయకుండా కాస్త నిదానంగానో నిమ్మళంగానో రాష్ట్రానికి ఏం కావాలో అవి అడగండి.. మీ వ్యక్తిగత అభ్యర్థనలు తీసుకుని పోయి వ్యక్తిగత చర్చల్లో ప్రస్తావించండి. గతంలో గల్లా జయ దేవ్ అనే టీడీపీ ఎంపీ కూడా ఇలానే అభాసుపాలయ్యారు. ఆయన తనకు చెందిన పండ్ల ఉత్పత్తుల వ్యాపారానికి సంబంధించి ప్రశ్నలు అడిగి అభాసు పాలయ్యాడు. డు కాదు రు. కనుక అడిగేటప్పుడు ప్రశ్న ఎవరికి ఉపయోగం ఎందుకు అడుగుతున్నాం.. వాటి వల్ల మన రాష్ట్రం ప్రగతి ఏ తీరున మారి మనకో కొత్త జీవితం ప్రసాదిస్తుంది అన్నవి ఆలోచించి అడగండి సర్.. విదేశాల్లో చదివి వచ్చారని విన్నానే..ఆ పాటి ఆలోచన లేదా స్పృహ లేకపోతే ఎలా అండి...అసలే ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం..తిరోగతిలో ఉన్న రాష్ట్రం.. ఈ సందర్భంలో నిర్హేతుక ప్రశ్నలు అడగడం తగునా! మిస్టర్ ఎంపీ జర శోచోరే!


నో డౌట్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెద్ద నేత. ఉమ్మడి ఆంధ్రాకు తిరుగులేని నేత. అయినా కూడా ఇప్పుడు ఈ పేర్ల గోలేంటి? తిరుపతి ఐఐటీ పేరు మార్చుకోవచ్చా? అని అడిగిన గ్రేట్ ఎంపీ మిథున్ రెడ్డి సర్ కు వందనాలు చెల్లించాలి. తిరుపతి ఐఐటీ పేరు ముందు రాజశేఖర్ రెడ్డి అని చేర్చి రాజశేఖర్ రెడ్డి ఐఐటీ కింద మారుస్తారా? ఆ విధంగా చేసి ఏం సాధిస్తారో చెబితే చాలా అంటే చాలా సంతోషిస్తాం. ఇప్పటికే ప్రతి పథకం మీ నాయకుల పేర్లతోనే నిండిపోతోంది. కేంద్రం ఇచ్చిన పథకాలకు కూడా మీరే పేర్లు తగిలించుకుని హాయిగా ప్రచార పర్వం సాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి సవరణ చేసి ఏం చెప్పాలనకుంటున్నారో గౌరవ ఎంపీ ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరిస్తే ఎంతో ఆనందిస్తాం. అదృష్టం కేంద్రం అందుకు నో చెప్పింది. ఇప్పట్లో వ్యక్తుల పేరిట విద్యా సంస్థలకు అందునా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు పేర్లు పెట్టడం జరగని పని అని తేల్చేసింది. ఇదొక్కటే ఇవాళ్టి పార్లమెంట్ లో మనకు దక్కిన మినహాయింపు. మనకు అనగా ఆంధ్రావని ప్రజలకు అని అర్థం.


- రత్నకిశోర్ శంభుమహంతి


మరింత సమాచారం తెలుసుకోండి: