సీపీఎస్ రద్దు కాదు
ఓపీఎస్ ను అమలు చేయడం అన్నది సాధ్యం కాదు
అయినా ఏదో ఓ ప్రత్యామ్నాయం ఆలోచించాలి
ఉద్యోగికి ఉన్న బాధలు ఎన్ని ఉన్నా.. చాలా మందికి ఉన్న
బాధలు కన్నా అవేవీ పెద్దవి కావు.. కానీ ఈ చిన్న గీతనే
పెద్ద గీత చేయాలని తాపత్రయపడుతున్నారు ఉద్యోగులు


చాలా గొంతెమ్మ కోర్కెలు కారణంగానే ఇవాళ ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఏమీ లేని వారి కన్నా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి కాస్త కాదు ఎంతో ఉన్నత రీతిలోనే  ఉన్నాడు. అయినా కూడా కొత్త వేతన సవరణ వెంటనే వర్తింపజేయాలని కోరడం వాటి పేరిట ఉద్యమాలు చేయడం అంత సబబు కాదు అనే అనిపిస్తోంది. అడగడం తప్పు కాకపోయినా అదే పనిగా రాజకీయం చేయడం మాత్రం సబబు కాదు. గతంలో ఉద్యోగ సంఘాల నుంచి కొందరు ఎమ్మెల్సీ లు అయ్యారు. ఇప్పుడు కూడా కానున్నారు. వీరంతా కలిసి జగన్ ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడ్చాలన్న ప్రయత్నంలో ఉంటే, దానిని కూడా వైసీపీ అడ్డుకోవాల్సిందే!


ఉద్యోగికి జీతం ఒకటో తారీఖునే ఇవ్వాలి..ఉద్యోగి వేళకు పనికి వెళ్లాలి.. అనగా వేళకు పని వేళకు జీతం అన్నవి జరగాలి. కానీ జరగవు. ఉద్యోగి వేళ తప్పి బడికి వేళ తప్పి ఆఫీసుకు వెళ్లిన దాఖలాలు ఎన్నో! అందరూ కాకపోయినా కొందరు వేళ తప్పి ఇంకొందరు నీతి తప్పి ప్రవర్తించిన దాఖలాలు ఎన్నో! మరి!  ఉద్యోగి అడుగుతున్న వేతన సవరణ పై ఎందుకింత రాద్ధాంతం. మరీ! అంత సమస్యాత్మకంగా జగన్ ప్రభుత్వం వీరిపై వ్యవహరిస్తుందా.. కరోనా కాలంలో కూడా ఉద్యోగిని బాగానే చూసుకుంది కదా! మధ్యంతర భృతి పేరిట  27 శాతం ఐఆర్ చెల్లించింది కదా! ఇంకేం కావాలి.

ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులు తిండికి లేక అవస్థలు పడుతున్నారు. చాలా మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు (ఎనిమిదివేలు) గత కొన్ని నెలలకు జీతాలు అందక ఉద్యోగం మానుకోలేక పస్తులుంటూ విధులకు హాజరవుతున్న ఘటనలూ ఉన్నాయి. మానవత్వం ఉంటే ముందు వారిని ఆదుకోండి. ప్రయివేటు ఉపాధ్యాయులు ఇవాళ్టికీ తిండికి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా తరువాత పరిస్థితులు సర్దుమణిగాక కూడా వారికి పని ఇవ్వని విద్యా సంస్థలు ఎన్నో! వారి గురించి ఆలోచించండి. అత్యవసరం అయి కరోనా సమయంలో కొందరికి ఉద్యోగాలు ఇచ్చి తీసుకున్నారు. వారికి ఇవాళ్టికీ జీతాలు లేవు. వారి సంగతి మీరు పట్టించుకోండి. ఇవేవీ  లేకుండా డీఏలు పెండింగ్ గురించి, పీఆర్సీ గురించి పదే పదే పట్టుబట్టడం అన్నది మానవత్వం అనిపించుకోదు.


మరింత సమాచారం తెలుసుకోండి: