2019 ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 151 సీట్లు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2012 లో వైసిపి ఆవిర్భవించిన 9 సంవత్సరాలకు జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ 9 సంవత్సరాలలో పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ... ఆర్థికంగా నష్టపోయిన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ నుంచి నాలుగైదు సార్లు గెలిచిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి - మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి - రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు - సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర లాంటి వారు ఏకంగా 4 - 5 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా విజయం సాధించి మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు.

అయితే జగన్ గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు సామాజిక సమీకరణలు , ప్రాంతీయ సమీకరణాల పేరుతో చాలా మంది జూనియర్ నేత‌ల‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఇంకా చెప్పాలంటే తొలిసారి గెలిచిన శంకర్ నారాయణ లాంటి నేతలకు సైతం మంత్రి పదవి ఇచ్చిన జగన్ ... పార్టీ సీనియర్లకు షాక్‌ ఇచ్చారు . ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న కేబినెట్ను 90% మారుస్తానని.. వారి స్థానాల్లో కొత్త మంత్రులు వస్తారని బహిరంగంగా చెప్పారు.

అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు అయిపోయింది. కొత్త మంత్రి వర్గం పై జగన్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దసరా దీపావళి కి కేబినెట్ ను మారుస్తారు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సంక్రాంతికి క్యాబినెట్ మారుతుంద‌ని కొంద‌రు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సంక్రాంతి తర్వాత కూడా కేబినెట్ మార్చారు అని తెలుస్తోంది.

మరోవైపు సీనియర్ల మాత్రం కేబినెట్లో మార్పులు చేర్పులు ఎప్పుడూ ఉంటాయా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇప్పుడు క్యాబినెట్ మారితే లేనిపోని తలనొప్పులు వస్తాయని... ఇప్పుడు ఉన్న క్యాబినెట్ ను కొద్దిరోజుల పాటు కంటిన్యూ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే పార్టీలో సీనియర్ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవటం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: