నారా చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఇద్దరూ నందమూరి తారక రామారావు అల్లుళ్లే.. వీరిలో చంద్రబాబుది చిత్తూరు జిల్లా అయితే.. దగ్గుబాటిది ప్రకాశం జిల్లా.. ఇద్దరూ రాజకీయాలకు చెందిన వారే.. అయితే.. చంద్రబాబు రాజకీయాల్లో రాణించి.. తెలుగుదేశం పార్టీలో కీలక స్థాయికి చేరారు. అప్పట్లో పేరుకు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడైనా.. పార్టీని నడిపించింది చంద్రబాబే అని చెబుతారు.


సాక్షాత్తూ మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉంచగలిగారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవి లాక్కునే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ చంద్రబాబుకే మద్దతు పలికారు. ఆ సమయంలోనే దగ్గుబాటిని కూడా చంద్రబాబు దగ్గరకు తీశారు. అయితే.. యూస్ అండ్ త్రో పాలసీని చంద్రబాబు వాడినంతగా ఎవరూ వాడలేదన్న విమర్శ ఉంది. సీఎం అయ్యాక చంద్రబాబు దగ్గుబాటికి ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. దీంతో దగ్గుబాటి చంద్రబాబుకు దూరమయ్యారు.


ఆనాటి నుంచి ఆ దూరం అలాగే కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన ఓ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయంగా పలకరించుకోవడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నాయి. అయితే.. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరినీ కలిపింది మాత్రం ఏపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలే అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. వల్లభనేని వంశీ ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన కొన్ని కామెంట్లు.. ఆ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేయడం.. బయట ప్రెస్ మీట్లో రోదించడం వంటి చర్యల తర్వాత.. చంద్రబాబు అంటే సొంత సామాజిక వర్గంలో ఓ సాఫ్ట్ కార్నర్ మరింత పెరిగింది. మనమంతా ఒక్కటైతే తప్ప కొడాలి నాని వంటి సొంత సామాజిక వర్గం వారిని దెబ్బ కొట్టలేం అన్న స్పృహ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. అంటే చంద్రబాబు, దగ్గుబాటిలను కలిపిన క్రెడిట్ ఏపీ మంత్రి కొడాలినాని, వల్లభనేని వంశీ అని చెప్పుకోవచ్చేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: