కొవిషీల్డ్ బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడో డోసు అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు కొవిషీల్డ్ బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం ఇన్ స్టిట్యూట్ చేసుకున్న దరఖాస్తును కమిటీ తిరస్కరించింది. అయితే వ్యాక్సిన్ కు సంబంధించి మరింత సమాచారం సమర్పించాలని.. కొత్త వేరియంట్ సమర్థంగా పనిచేసేలా దీన్ని తయారు చేయాలని సూచించింది.

మరోవైపు ఈ ఏడాది సెకండ వేవ్ సందర్భంగా ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఔషధ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో 51.5శాతం, మేలో 47.8శాతం వృద్ధి కనిపించింది. అయితే ఆ తర్వాత మందుల అమ్మకాలు కాస్త తగ్గాయి. కానీ నవంబర్ లో మళ్లీ మెడికల్ సేల్స్ 6.6శాతం పెరిగాయి. అయితే ఈ సారి కొవిడ్ కోసం కాకుండా ఇతర సమస్యలైన గ్యాస్ట్రో, శ్వాసకోశ, నొప్పులు, గైనకాలజీ తదితర మందుల అమ్మకాలు పెరిగినట్టు తేలింది.

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈరోజు, రేపు ముంబై నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ప్రజలు కూడా గుంపులుగా తిరగడానికి వీల్లేదనే నిబంధనలు విధించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే మహారాష్ట్రలో నిన్న కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అక్కడ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. తాజాగా జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అది ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవడం గమనర్హం. అదే వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 33కు చేరింది.
















మరింత సమాచారం తెలుసుకోండి: