2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి 2019 అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే బాగుంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధానిగా, కర్నూలు నగరాన్ని న్యాయ రాజధానిగా ఎంపిక చేశారు వైఎస్ జగన్. అయిదే దీనితో సీఎం ప్రకటనను వ్యతిరేకించిన అమరావతి రైతులు... న్యాయ స్థానంలో కేసులు కూడా వేశారు. అదే సమయంలో సేవ్ అమరావతి పేరుతో తిరుమల వరకు మహా పాదయాత్ర కూడా చేపట్టారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 17వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఇప్పటికే ప్రభుత్వం అడ్డుకుంటోంది కూడా. ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు కూడా.

ఇప్పుడు తాజాగా కౌంటర్ సభ నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. రాయలసీమ హక్కుల వేదిక భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 13వ తేదీన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ హక్కుల కోసం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనిని రాయలసీమ ధర్మ పోరాట దీక్ష అనే పేరు కూడా పెట్టేశారు. ఈ సభకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చేశారు. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సభలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కర్నూలో హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో సభకు ఏర్పాటు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: