కొన్ని మాటలు అవధులు దాటి పోయి
కొన్ని మాటలు పరిధిని మించి పోయి
అటుపై పరువు పోయి చాలా విపరిణామాలకు
దారిచ్చాయి.. ఫలితం ఇప్పుడు వంశీ ఒక ఒంటరి

 

వల్లభనేని వంశీ మోహన్ అనే ఎమ్మెల్యే కు వైసీసీకి మధ్య దూరం పెరిగింది అన్నది ఓ వాస్తవం. అవును ఈ కారణంగానే ఆయనను చాలా మంది వైసీపీ నాయకులు కూడా దూరం పెడుతున్నారు. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగానే ప్రజల్లో తమ పరువు పోయిందని వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల ఈ మాటల ప్రభావం తప్పక ఉంటుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే దిద్దుబాటులో భాగంగా ఆయనను దూరం పెట్టి మాట్లాడుతున్నారు. ఓ విధంగా ఇది కూడా జగన్ డ్రామానే అని అంటున్నారు కొందరు. ఎందుకంటే ఆ పార్టీలో అధినేత చెప్పనిదే ఆవగింజంత కూడా కదలదు అన్నది ఓ అభిప్రాయం కనుక వంశీ ఎవరిని తిట్టినా కొడాలి నాని ఎవ్వరిని తిట్టినా అవన్నీ జగన్ ఖాతా నుంచి వచ్చినవే! కేవలం వీళ్లిద్దరూ పై పై ముఖాలే అన్నది కూడా ఓ వాస్తవం. ఈ నేపథ్యంలో వెనుక ఉండి రాజకీయం నడిపిన జగన్ కు ఆ ఇద్దరినీ ఇకపై నియంత్రించాల్సిన సమయం వచ్చేసింది. లేదా వారిద్దరినీ దూరం పెట్టి రాజకీయం నడిపి విజయం సాధించాల్సిన సమయం కూడా ఆసన్నం అయింది.



ఆంధ్రావని రాజకీయాలకు మరో మలుపు ఇచ్చారు వంశీ వల్లభనేని.. ఆయనేం పెద్ద స్థాయి లీడర్ కాదు ఇంకా చెప్పాలంటే చాలా దిగువ స్థాయి నుంచి ఎదిగి వచ్చిన మనిషి. ఒకప్పుడు పరిటాల రవి అనుచరుడు. ఆయన కార్ డ్రైవర్. కాలం కలిసివచ్చాక ఎమ్మెల్యే అయ్యారు. కాలం కలిసి వచ్చాక చంద్రబాబు అనే సొంత మనిషిపై, లోకేశ్ అనే మరో సొంత మనిషి పై తిరుగుబాటు చేశారు. కొన్ని బూతులు తిట్టారు.. గీతలు దాటారు.. హద్దులు దాటారు.. సీఎం జగన్ అండతో తన పరిధి దాటి ప్రవర్తించారు. అనరాని మాటలూ అన్నారు. అన్నాక ఇప్పుడిక ఒంటరి అయ్యారు. ఎవరు ఎలా ఉన్నా కూడా ఎవరి వ్యక్తిత్వ రీతి వారు దాటి మాట్లాడకూడదు. ఎవరి ఎంతటి స్థాయికి చేరుకున్నా కూడా తమని తాము ఎక్కువ చేసుకుని మాట్లాడకూడదు. ఈ పాటి ఆలోచించకుండా మాట్లాడడం తగదు.


మరింత సమాచారం తెలుసుకోండి: