నేటి బాలలే రేపటి ప్రపంచ భవిష్యత్తు. వారి సంక్షేమం పైనే ఏ దేశ అభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి బాల నిధి సంస్థ కృషి విస్మరించలేనిది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా, ఆసియాలో తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లోని పిల్లలకు అత్యవసర సహాయం అందించేందుకు ఐరాస 1946 డిసెంబర్ 11న తాత్కాలికంగా అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థను ఏర్పాటు చేసింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పలు ఇక్కట్ల తో సతమతమవుతున్న పిల్లలకు ఇది ఎప్పటికీ ఆధరువు గా నిలవాలని 1953లో ఐరాస సాధారణ సభ తీర్మానించింది.దాంతో యూనిసెఫ్ శాశ్వత సంస్థగా మారింది.దానిపేరు లోని అంతర్జాతీయ అత్యవసర పదాలను తొలగించినప్పటికీ ఆ పేరు బహుళ ప్రచారం పొందడంతో అలాగే కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి చిన్నారికి ఆత్మీయ హస్తం అందించాలన్న ఆశయంతో 75 ఏళ్లుగా యూనిసెఫ్ నిర్విరామ ప్రయాణం సాగిస్తోంది. దాని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం,నీరు, పారిశుధ్యం, విద్య, పరిరక్షణ, లైంగిక సమానత్వం వంటి అంశాల్లో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇతర సంస్థలతో కలసి యూనిసెఫ్ పని చేస్తోంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, వ్యక్తుల నుంచి అందే విరాళాలతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

 యూనిసెఫ్ విశేష సేవల్లో 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇండియాలో ప్రతి శిశువు జననం మేలిమి జీవితానికి ఉత్తమ ఆరంభంగా ఉండాలన్నది  యూనిసెఫ్ ఆకాంక్ష. దేశీయంగా 1949లో యూనిసెఫ్ యొక్క కార్యకలాపాలు మొదలయ్యాయి. భారత్ లోని పెన్సిలిన్ తయారీ కేంద్రానికి యూనిసెఫ్  పరికరాలు, సాంకేతిక సహకారం అందించింది. వృధాగా మిగిలిపోతున్న పాలను పిల్లలకు  అందించడంలో కీలక చొరవ చూపింది. కరోనా ప్రభావం బాలలపై తీవ్రంగా ఉండబోతోందన్న యూనిసెఫ్ హెచ్చరిక ప్రపంచం మొత్తాన్ని అప్రమత్తం చేసింది. కరోణ కారణంగా  గత 75 సంవత్సరాలలో పిల్లల విషయంలో సాధించిన పురోగతికి ముప్పు ఏర్పడింది. పేదరికంలోకి చిన్నారులను నెట్టివేసింది. 10కోట్ల మందికి పైగా చిన్నారులు పేదరికంలోకి జారుకోగా కరోణ అనంతరం 10% పెరుగుదల నమోదయింది. కరోణ కారణంగా 93 శాతానికి పైగా ఆరోగ్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపింది. బాల కార్మికులు సైతం భారీగా పెరిగారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఐదు కోట్లకు చేరగా వచ్చే ఏడాది చివరి నాటికి మరో 90 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేసింది. యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చిన్నారుల్లో ఆకలి,నిరక్షరాస్యత , వేధింపులు, పేదరికం, బలవంతపు బాల్య వివాహాలు పెరుగుతున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: